టాలివుడ్ లో మొన్నటి వరకు వరుస సినిమాలు చేసిన ఓ హీరోయిన్ సిచ్చుయేషన్ ఇప్పుడు చిత్రంగా తయారైంది. వరుసగా ప్లాపులు కొడుతోన్న టైంలో అవకాశాలిచ్చిన డైరెక్టర్లు ఒక్క సూపర్ హిట్ పడగానే ఆ హీరోయిన్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇంతకీ ఎవరా హీరోయిన్..?
ఎఫ్ 2 సినిమాతో ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ మెహ్రీన్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. సాధారణంగా ఏ హీరోయిన్ కి ఐనా ఒక్క సూపర్ హిట్ పడితే చాలు ఆ తర్వాత అవకాశాలు వద్దన్నా వెతుక్కుంటూ వచ్చేస్తాయి. కానీ మెహ్రీన్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో మెహ్రీన్ కి ఒక్క సినిమా కూడా లేదు. ఎఫ్ 2 సినిమాకి ముందు మెహ్రీన్ నటించిన కవచం, నోటా, పంతం, జవాన్, కేరాఫ్ సూర్య ఇలా ఐదు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయితే అప్పట్లో వెంటవెంటనే ప్లాపులు పడినా మెహ్రీన్ కి అవకాశాలకి కొదవలేదు. కానీ ఇప్పుడే సూపర్ హిట్టు సినిమా కొట్టినా డైరెక్టర్లెవ్వరూ ఛాన్స్ ఇవ్వడం లేదు.
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలివుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఆ తర్వత మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టింది. కానీ ఆ తర్వాతే అమ్మడుకి కాలం కలిసిరాలేదు. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందనుకుంటే ప్లాప్ సినిమాలతో వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం మెహ్రీన్ పంజాబీలో డీఎస్పీ దేవ్ అనే సినిమాలో నటిస్తోంది.