Aadi Keshava Review : ఆదికేశవ మూవీ రివ్యూ.. రుద్రకాళేశ్వరుడిగా వైష్ణవ్ ఊర మాస్..

వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ రివ్యూ వచ్చేసింది. థియేటర్ లో ఆదికేశవుడు అలరించాడా..?

Panja Vaisshnav Tej Sreeleela Aadikeshava movie review

Aadi Keshava Review : వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), శ్రీలీల(Sreeleela) జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదికేశవ’. మలయాళం స్టార్ నటుడు జోజు జార్జ్ ఇందులో విలన్ గా నటిస్తూ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆదికేశవ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో సంయుక్తంగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కింది. నేడు నవంబర్ 24న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..
బాలు(వైష్ణవ్) చదువు అయిపోయి ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో అమ్మ జాబ్ తెచ్చుకోమని చెప్పడంతో చిత్ర(శ్రీలీల) సీఈవోగా ఉన్న కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాడు. బాలు, చిత్ర ప్రేమించుకుంటున్నారని తెలిసి వాళ్ళ నాన్న ఇంకొకరితో అందరిముందు చిత్రకు పెళ్లి అనౌన్స్ చేస్తాడు. చిత్ర వాళ్ళ నాన్న బాలుని కొట్టిద్దాం అనుకున్న సమయంలో బాలు వాళ్ళ అమ్మ వచ్చి మేము నీ అసలు అమ్మ నాన్న కాదు, నీ సొంత నాన్న మహాకాళేశ్వర్ రెడ్డి(సుమన్) చనిపోయాడు అని అతని తరుపు వాళ్ళతో రాయలసీమకు పంపుతుంది. మహాకాళేశ్వర రెడ్డి ఎవరు? అతను ఎలా చనిపోయాడు? బాలు, చిత్రల ప్రేమ ఏమైంది? బాలు రాయలసీమకు వెళ్ళాక రుద్రా కాళేశ్వరరెడ్డిగా ఎలా మారాడు? మధ్యలో చెంగారెడ్డి మైనింగ్ కథేంటి? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
ఇది పూర్తిగా B,C సెంటర్స్ మాస్ కమర్షియల్ సినిమా. చిన్నప్పుడే హీరోని సీమకు దూరంగా పంపడం, ఏదో ఒక సంఘటనతో అతను సీమకు తిరిగొచ్చి ఇక్కడ విలన్స్ ని చంపడం అనేది తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన వీరసింహారెడ్డి కూడా ఇంచుమించు ఇలాంటి కథే. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ ప్రేమ, ఓ పాట, ఓ ఫైట్ అన్నట్టు సాగుతుంది. ఇంటర్వెల్ కి హీరో సీమకి వెళ్లడం, సెకండ్ హాఫ్ లో హీరో వాళ్ళ నాన్న గురించి, అక్కడి విలన్ గురించి, అక్కడి ప్రజల గురించి తెలుసుకొని పోరాడటం జరుగుతుంది. కథనం అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు. కాకపోతే లాజిక్ లెస్ సీన్స్ చాలా ఉంటాయి. ఇక ఫైట్స్ అయితే బోయపాటి సినిమాలని మించి ఉంటాయి. మనుషులని ఇన్ని రకాలుగా చంపొచ్చా అనే సందేహం వస్తుంది ఆ మాస్ ఫైట్స్ చూసి. సినిమా అంతా అయ్యాక చివర్లో ఇచ్చే ఓ ట్విస్ట్ ఆసక్తిగా ఉంటుంది.

Also read : Sound Party Review : సౌండ్ పార్టీ మూవీ రివ్యూ.. కామెడీతో ఫుల్‌గా సౌండ్ చేసిందా?

నటీనటుల విషయానికి వస్తే..
ఫస్ట్ హాఫ్ లో యూత్ హీరోలా కనపడి మెప్పించిన వైష్ణవ్ తేజ్ సెకండ్ హాఫ్ లో మాత్రం రుద్రకాళేశ్వర రెడ్డిగా వయసు మించిన పాత్ర చేసాడనిపిస్తుంది. హీరోయిన్ గా శ్రీలీల కమర్షియల్ సినిమాల్లో కేవలం సాంగ్స్, ప్రేమ సన్నివేశాలకు పరిమితమైనట్టే అయింది. కానీ ఎప్పటిలాగే తన డ్యాన్స్ తో, అందాలతో మెప్పించింది. ఇక విలన్ గా జోజు జార్జ్ కొంచెం పవర్ ఫుల్ గానే కనపడ్డాడు. హీరో ఫ్రెండ్ గా సుదర్శన్ కామెడీ పండించాడు. హీరో తల్లిగా రాధిక, అసలు తండ్రిగా సుమన్, పెదనాన్నగా తనికెళ్ళ భరణి, విలన్ భార్య పాత్రలో సదా.. పర్వాలేదనిపించారు.

టెక్నికల్ అంశాలలో..
కెమెరా విజువల్స్ బాగా రిచ్ గానే చూపించారు. ఫైట్స్, ఎలివేషన్స్ లో BGM శివుడికి సంబంధించిన స్తోత్రాలతో హెవీగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇక ఫైట్స్ బోయపాటి సినిమాలని మించి ఉంటాయి. ఫైట్స్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేశారని చెప్పొచ్చు. ఒక పాత కథ, పాత కమర్షియల్ పంథాని తీసుకున్నా డైరెక్టర్ శ్రీకాంత్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగించాడు సినిమాని.

మొత్తంగా తన పుట్టిన వాళ్ళకి, ఊరుకి దూరంగా పెరిగిన హీరో ఒక సంఘటనతో తన పుట్టిన ఊరుకి వెళ్లి అక్కడ సమస్యలు ఎలా తీర్చాడు అనే ఓ కమర్షియల్ కథ. వైష్ణవ్ మొదటిసారి చేసిన ఊర మాస్ ఫైట్స్, శ్రీలీల డ్యాన్సుల కోసం థియేటర్ కి వెళ్లి చూసేయొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ, రేటింగ్ వీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు