Sound Party Review : సౌండ్ పార్టీ మూవీ రివ్యూ.. కామెడీతో ఫుల్‌గా సౌండ్ చేసిందా?

బిగ్‌బాస్ ఫేమ్ VJ సన్నీ హీరోగా తెరకెక్కిన 'సౌండ్ పార్టీ' సినిమా నేడు కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Sound Party Review : సౌండ్ పార్టీ మూవీ రివ్యూ.. కామెడీతో ఫుల్‌గా సౌండ్ చేసిందా?

Bigg Boss Fame VJ Sunny new movie Sound Party review

యాంకర్, సీరియల్ నటుడు VJ సన్నీ బిగ్ బాస్ సీజన్ 5లో విన్నర్ గా నిలిచిన తర్వాత హీరోగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా VJ సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమా నేడు నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా తెరకెక్కిన సినిమా ‘సౌండ్ పార్టీ’. VJ సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్రలు ఈ సినిమాని నిర్మించారు. సంజ‌య్ శేరి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ‘సౌండ్ పార్టీ’ని ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాగా ప్రమోట్ చేశారు. సినిమా కూడా దానికి తగ్గట్టే ఉంది.

కథ విషయానికి వస్తే.. కుబేర్ కుమార్(శివన్నారాయణ), డాలర్ కుమార్ (VJ సన్నీ) తండ్రి కొడుకులు. తరతరాలుగా వీరి ఫ్యామిలీ బాగా రిచ్ అవ్వాలని కలలు కంటూ మిడిల్ క్లాస్ బతుకులతో బతికేస్తు ఉంటారు. సిరి(హ్రితిక శ్రీనివాస్) తనకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, త్వరగా సెటిల్ అవ్వాలని తన లవర్ డాలర్ కుమార్ కి చెప్తూ ఉంటుంది. దీంతో డాలర్ కుమార్, కుబేర్ కుమార్, ఫ్యామిలీ అంతా కలిసి చాలా ఆలోచనలు చేసి డబ్బులు అప్పు తీస్కొని సరికొత్త కాన్సెప్ట్ తో గోరుముద్ద అనే ఒక హోటల్ పెడతారు. అనుకోకుండా ఆ హోటల్ సీజ్ అవ్వడం, డబ్బులు అప్పు తీసుకున్న వాళ్ళు వార్నింగ్స్ ఇవ్వడంతో డబ్బులు ఎలా అనుకుంటున్న సమయంలో ఓ దొంగతనం కేసు ఒప్పుకొని జైలుకి వెళ్తే రెండు కోట్లు ఇస్తాం అని చెప్పడంతో ఒప్పుకుంటారు. తీరా ఒప్పుకున్నాక అది రేప్ కేసు అని తెలిసి ఉరి శిక్ష పడటంతో ఏమి తెలియని పరిస్థితిలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఉంటారు. మరి ఇద్దరు తండ్రి కొడుకులు ఉరిశిక్ష ఎలా తప్పించుకున్నారు? అసలు రేప్ ఎవరు చేశారు? డాలర్ కుమార్ సిరిని పెళ్లి చేసుకున్నాడా? ఈ ఫ్యామిలీ డబ్బున్న వాళ్ళుగా మారారా? జైలులో ఏం చేశారు? మధ్యలో బిట్ కాయిన్స్ కథేంటి? అనేది తెరపై చూడాల్సిందే.

Also read : Dhruva Natchathiram : రిలీజ్‌కి ఒక్క రోజు ముందు.. మళ్ళీ వాయిదా పడ్డ ధ్రువ నక్షత్రం..

సినిమా విశ్లేషణ.. కథ పరంగా చూస్తే ఒక సీరియస్ కథే అయినా మొదటి నుంచి చివరి వరకు ఫుల్ కామెడీతోనే రాసుకొని నవ్వించారు. మొదటి హాఫ్ అంతా తండ్రి కొడుకులు డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాంతో కామెడీని జనరేట్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ ఎక్కువ కామెడీ వర్కౌట్ అవ్వకపోయినా పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ గా నవ్వుతూనే ఉంటాము. తండ్రీకొడుకులు జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలు, RRR సినిమా స్పూఫ్, బిట్ కాయిన్స్ సీన్స్.. ఇలా అన్ని ఫుల్ గా నవ్వుని తెప్పిస్తాయి. ఈ సీన్స్ లో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అయితే సినిమాలో రేప్ అనే సీరియస్ సంఘటనలు, వాటి పర్యవసానాలు కూడా కామెడీగా చూపించడంతో కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తో, సెకండ్ హాఫ్ లో డబ్బు గురించి ఒక సాంగ్ పర్వాలేదనిపిస్తాయి. కాకపోతే కొన్ని సీన్స్ లాజిక్స్ వెతుక్కోకుండా కేవలం కామెడీ కోసమే చూడాలి.

నటీనటుల విషయానికొస్తే.. VJ సన్నీ, శివన్నారాయణ మెయిన్ లీడ్స్ లో కలిసి బాగా కామెడీ పండించారు. హీరోయిన్ గా హ్రితిక శ్రీనివాస్ తన అందంతో మెప్పించింది. సెకండ్ హాఫ్ లో ఓ కీలక సన్నివేశంలో తానే ముందుండి నడిపిస్తుంది. జైలర్ గా సప్తగిరి అదరగొట్టాడు అనే చెప్పొచ్చు. పృథ్వి, మాణిక్ రెడ్డి, ప్రియా, రేఖ.. ఇలా మిగిలిన ఆర్టిస్టులు కూడా పర్వాలేదనిపించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే.. కథ అంతా బోధన్ లో జరుగుతున్నట్టు చూపించారు. చాలా సీన్స్ రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు. కెమెరా విజువల్స్ రిచ్ గానే అనిపిస్తాయి. సంగీతం మాత్రం అక్కడక్కడా హెవీగా అనిపించినా కామెడీ సన్నివేశాల్లో మాత్రం పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఉన్న రెండు పాటలు కూడా వినడానికి బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ కూడా తక్కువ లెంగ్త్ కి కరెక్ట్ గా చేసి వినోదాన్ని పంచారు. సినిమా కేవలం 2 గంటల 5 నిముషాలు మాత్రమే ఉండటం కలిసొస్తుంది.

మొత్తంగా ఇద్దరు తండ్రీకొడుకులు ధనవంతులు అవ్వడానికి ఏం చేశారు అనేది ఫుల్ లెంగ్త్ కామెడీగా చూపించి ప్రేక్షకులని నవ్వించింది ‘సౌండ్ పార్టీ’. ఈ సినిమాకు రేటింగ్ 2.75 వరకు ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ, రేటింగ్ వీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.