నటసింహ నందమూరి బాలకృష్ణతో మళ్లీ సినిమా చేయాలని ఉందని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్నారు. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘బద్రి’ సినిమా ఏప్రిల్ 20 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ నటించిన ‘పైసా వసూల్’ సినిమా గురించి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు పూరి. తనకు బాలకృష్ణ నవ్వంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆయనతో సరదాగా సాగిపోయే పాత్ర చేయించాలనుకున్నానని, అందుకే ‘పైసా వసూల్’ సినిమా చేశానని తెలిపారు. ఆ సినిమాలో హీరో పాత్రకు ‘తేడా సింగ్’ అనే పేరు పెడితే బాలకృష్ణ ఏమీ అనలేదని, బాలయ్య సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా ఎనర్జీగా ఉంటారని, కల్మషం లేని వ్యక్తి, ఆయనకంటూ ఓ క్యారెక్టర్ ఉంది, మాట మీద నిలబడతాడు అంటూ పూరీ చెప్పుకొచ్చారు.
బాలయ్య గురించి పూరీ జగన్నాథ్ ఇంకా మాట్లాడుతూ.. ‘‘నాతో సినిమా చేయొద్దని చాలా మంది చెప్పినప్పటికీ బాలయ్య నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పుడే ఆయనేంటో తెలిసింది. ‘పైసా వసూల్‘ సినిమా కథను ఆయనకు 10 నిమిషాలే చెప్పా. నువ్వుంటో తెలుసు.. మనం కలిసి సినిమా చేస్తున్నాం.. అన్నారు. ఆయన ముక్కు సూటి మనిషి. ప్రేమ, కోపం రెండూ ముఖం మీదే చెబుతారు.. ఆయనతో మళ్లీ సినిమా చేయడానికి ఎప్పుడంటే అప్పుడు రెడీ.. ప్రస్తుతానికి బాలయ్య కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నా’’ అని అన్నారు.