నిషేధానికి గురైన తొలి తెలుగు చిత్రం ‘రైతు బిడ్డ’.. గూడవల్లి రామబ్రహ్మం తీసిన ఈ సినిమా నిర్మాణం వెనుక బోలెడంత చరిత్ర ఉంది. ‘రైతు బిడ్డ’ రిలీజై నేటికి 80 ఏళ్ళు..
‘మాలపిల్ల’ తరువాత ‘పల్నాటియుద్ధం’ సినిమా తీయాలనుకున్నారు గూడవల్లి రామబ్రహ్మం. కానీ ‘మాలపిల్ల’ ఘనవిజయం సాధించడంతో మళ్ళీ సాంఘిక సమస్య నేపథ్యంలోనే సినిమా చేయాలని నిశ్చయించుకున్నారు. ‘దున్నేవాడిదే భూమి’, ‘జమీందారీ విధానాలు పోవాలి’ లాంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ‘రైతుబిడ్డ’ కథ సిద్ధం చేశారు రామబ్రహ్మం. ‘మాలపిల్ల’కు పనిచేసిన సాంకేతిక బృందాన్నే ‘రైతుబిడ్డ’కూ కొనసాగించారు. ‘మాలపిల్ల’కు స్క్రీన్‌ప్లే సమకూర్చడమే కాక, కొన్ని పాటలు కూడా రాసిన తాపీ ధర్మారావు నాయుడు ‘రైతుబిడ్డ’కు త్రిపురనేని గోపీచంద్‌తో కలిసి మాటలు రాశారు. ‘మాలపిల్ల’ తరహాలోనే మల్లాది విశ్వనాధ కవిరాజు దీనికి హాస్య సంభాషణలు సమ కూర్చారు.
అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి ఉన్నారు కొసరాజు రాఘవయ్య చౌదరి. ఆయనను మద్రాసు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు రామ బ్రహ్మం. రైల్వేస్టేషన్‌కు తానే స్వయంగా వెళ్ళారు. ‘నిద్ర మేల్కొనరా తమ్ముడా… గాఢ నిద్ర మేల్కొనరా తమ్ముడా’ అనేది కొసరాజు రాసిన సినిమా పాట. ‘రైతుపైన అభి మానం చూపని రాజులుండ నేల?’, ‘సై సై చిన్నపరెడ్డి’ అనే మరో రెండు పాటలను కూడా రాశారు కొసరాజు. రామబ్రహ్మం ఆయనను అంత టితో వదిలిపెట్టలేదు. పట్టుపట్టి రైతు ప్రతినిధి రామిరెడ్డి పాత్రకు ఎంపిక చేశారు. ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు, నెల్లూరు ‘జమీన్‌రైతు’ వార పత్రిక స్ధాపకులు నెల్లూరు వెంకట్రామా నాయుడు గేయాలను, గాంధీ మహాత్ముని ఆస్ధానకవిగా పేరొందిన తుమ్మల సీతా రామమూర్తి పద్యాలను కూడా ఈ చిత్రంలో రామబ్రహ్మం వాడుకున్నారు. మరికొన్ని పాటలను తాపీ ధర్మారావు, సముద్రాల రాఘవాచార్య రాశారు.
కథానాయకుడైన రైతు పెద్ద నరిసిరెడ్డి పాత్రకు రంగస్థలం మీద తిరుగులేని తారగా పేరు తెచ్చుకున్న బళ్ళారి రాఘవను తీసుకున్నారు. బళ్ళారి రాఘవ తొలి చిత్రం ‘ద్రౌపదీ మాన సంరక్షణం’ (1936). అందులో దుర్యోధనుడి పాత్ర పోషించిన రాఘవ ఆ తరువాత ‘రైతుబిడ్డ’ చేయటానికి అంగీకరించారు. ఆయన భార్య పాత్రకు ప్రముఖ రంగస్థల నటి కొమ్మూరి పద్మావతి దేవి ఎంపికయ్యారు. స్త్రీ పాత్రను స్త్రీలే ధరించాలన్న రాఘవ ఆశయాలతో ప్రభావితమై కొమ్మూరి పద్మావతి రంగస్థలం పైకి ధైర్యంగా అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. ఈ పద్మావతిదేవి తనయుడే ప్రముఖ నవలా రచయిత కొమ్మూరి సాంబశివరావు. ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు సోదరుని కుమార్తె అయిన టంగుటూరి సూర్యకుమారిని ఇందులో రైతు కుమార్తె పాత్రకు తీసుకున్నారు. అప్పుడామె వయసు 14 ఏళ్లు. అప్పటికే ఆమె ‘విప్రనారాయణ’ (1937), ‘అంబికాపతి’ (1938), ‘అదృష్టం’ (1938) తదితర తమిళ చిత్రాల్లో నటించారు. టంగుటూరి సూర్య కుమారికి తొలి తెలుగు సినిమా అవకాశం ఇదే. ఆనాటి జమీందారీ గ్రామాలలో సన్న కారు రైతులు అనుభవిస్తున్న కడగండ్లను, జమీందారుల అకృత్యాలను, ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా వాస్తవిక దృక్పథంతో చిత్రీకరించాలని, ఈ విషయంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడా లని రామబ్రహ్మం ముందుగానే నిశ్చ యించుకున్నారు.
మద్రాసులోని మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్ స్టూడియోలో ‘రైతుబిడ్డ’ షూటింగ్ మొదలైంది. సినిమా అంతా అక్కడే పూర్తయింది. ఇందులో పాత్రధారుల పారితోషికాలకి మొత్తం పాతికవేలు ఖర్చయ్యింది. ఈ సినిమాను షూటింగ్ దశలోనే జమీందార్లు నిషేధింపజేస్తారేమోనని రామ బ్రహ్మం చాలాసార్లు అనుకున్నారు. కానీ ఎలాంటి అవాంతరం రాలేదు. మొత్తానికి 1939 ఆగస్టు 27న ‘రైతుబిడ్డ’ ఆంధ్ర దేశంలో 11 కేంద్రాల్లో విడుదలైంది. అంతకు ముందే ఆ చిత్ర ప్రదర్శనను ఆపించాలని కొంత మంది జమీందార్లు న్యాయస్థానం ద్వారా ‘స్టే ఆర్డర్’ జారీ చేయించారు. కానీ, అప్పటికే సెన్సార్ బోర్డు వారు ఆ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంతో సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.
వెంకటగిరి జమీందార్లు ‘రైతుబిడ్డ’ చిత్రం ప్రింట్లు కొన్నింటిని తగలబెట్టించి ప్రదర్శనలను ఆపు చేయించడానికి ప్రయత్నించ డంతో అల్లర్లు చెలరేగాయి. జమీందారీ వ్యవస్థలను రద్దు చేయాలని ప్రభుత్వం బిల్లు పెట్టిన కొన్నేళ్లకు ముందే రామబ్రహ్మం ‘రైతు బిడ్డ’ను తీసి దర్శకుడిగా తానెంత ముందు చూపు గల వాడినో నిరూపించుకున్నారు. సినిమా ప్రజల మీద ఎలా ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. తెలుగు సినిమా చరిత్రలో ప్రభుత్వం ఆంక్షలకు, నిషేధానికి గురైన మొదటి చిత్రం ‘రైతుబిడ్డ’. ఇందులో జమీందార్ల దౌర్జన్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు గూడవల్లి. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని జమీందారులు మండిపడి, ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి చివరికి ప్రజల్లో అలజడి కలిగించవచ్చుననే మిషతో ఆయా జమీందార్ల ప్రోద్బలంతో నిషేధింప చేశారు. కొన్ని జమీందారీ పట్టణాల్లో కలెక్టర్లే ఈ చిత్రాన్ని నిషేధించారు.
మదరాసు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశంగారు బిల్లు ప్రవేశపెట్టడానికి ‘రైతు బిడ్డ’ సినిమా ఎంతగానో తోడ్పడిందని అప్పట్లో చెప్పుకునేవారు. బొబ్బిలి రాజా, వెంకటగిరి రాజా ఈ సినిమా నిర్మాత మీద పరువు నష్టం దావా వేస్తామని బెదిరించారు కూడా. చల్లపల్లి రాజా స్వంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమా నిషేధానికి గురైంది. మొత్తం మీద జనం అంతా ఆ సినిమాను చూసేందుకు అప్పట్లో మాత్రం వీలుకాలేదు. ఆ తరువాత చాలా కాలానికి ‘రైతుబిడ్డ’ మళ్లీ వెలుగు చూసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నిర్మాతలు ఎవరూ చాలా రోజులపాటు మళ్ళీ అభ్యుదయ చిత్రాలు తీసేందుకు సాహసించలేదు.
చిత్రమేమిటంటే సారథీ సంస్ధ చల్లపల్లి జమీందార్ యాజమాన్యంలో వుంది. అయినా కూడా గూడవల్లి జమీందారీ వ్యవస్ధకూ, విధానాలకూ వ్యతిరేకంగా ఈ చిత్రం చేయడం ఒకరకంగా పెద్ద సాహసమే. సారథీ ఫిలింస్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ చల్లపల్లి రాజా ఈ సినిమాకి అభ్యంతరం చెప్పకపోగా ప్రోత్సహిం చారు. ‘మాలపిల్ల’ సినిమాతో తెలుగు సినిమా సంగీతాన్ని ఒక మలుపు తిప్పిన భీమవరపు నరసింహారావు ‘రైతుబిడ్డ’తో మరోసారి తన సత్తా చాటుకున్నారు. అలాగే జమీందారు అనుచరుడిగా రైతులను పీడించే ఖాసా సుబ్బన్న పాత్రలో ఆయన నటించారు. ఇక కొసరాజు పాటలు పెద్ద హిట్టయ్యాయి. నటుడుగా కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది. సినిమాలో తన పాత్రకు సంబంధిం చిన పాటలను తానే పాడుకున్నారు కొసరాజు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన తన స్వస్థలం వెళ్లి పోయారు. ఆ తర్వాత మళ్లీ పదమూడేళ్లకు ‘పెద్దమనుషులు’ కోసం తిరిగి చిత్రసీమకు వచ్చారు. ఇందులో టంగుటూరి సూర్యకుమారి పాడిన ‘రాబోకు రాబోకురా చందు రుడా…’ అప్పట్లో పెద్ద హిట్టు. బళ్లారి రాఘవ కీర్తిని మరింత పెంచింది ఈ సినిమా. అయితే ఎందుకనో ఆయన సినిమా రంగం మీద మక్కువ పెంచుకోలేదు. ఈ సినిమా తర్వాత ‘చండిక’ అనే సినిమాలో మాత్రమే నటించి చిత్ర సీమకు బై బై చెప్పేశారు.
ప్రసిద్ధ నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఈ చిత్రానికి నృత్య సారథ్యం వహించడమేకాక, దశావతార నృత్య సన్నివేశంలో నటించారు కూడా. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక రాజకీయ పక్షం వారు దశావతార ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. ఈ సన్నివేశంలో వేదాంతం రాఘవయ్య కూచిపూడి నాట్యకళా ప్రతిభను చక్కగా వినియోగించుకున్నారు గూడవల్లి.
గూడవల్లి రామబ్రహ్మం కూడా ఈ చిత్రంలో నటించారు. పత్రికా సంపాదకునిగా ఒక దృశ్యంలో కనబడతారాయన. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మాగోఖలే ఈ సినిమా ద్వారానే ఆర్ట్ డిపార్ట్ మెంట్‌లోకి ప్రవేశించారు. భీమవరపు నరసింహారావు రికమండేషన్‌తో ఈ అవకాశం సంపాదించారు. మద్రాసు ప్రావిన్స్ ప్రధానమంత్రిగా వున్న (1930-32) బొల్లిని మునిస్వామి నాయుడికి ఈ చిత్రాన్ని అంకితమిచ్చారు. ఆయన రైతు పరిరక్షణకు తనవంతు సహాయ సహకారాలందజేశారు. తెలుగు చలనచిత్రాల్లోని కథాగమనానికి కొత్త స్ఫూర్తినిచ్చిన ఈ చిత్రం నెగటివ్‌ని పూనాలోని ఫిలిం ఆర్కైవ్స్‌లో భద్రపరిచారు.
కథా సంగ్రహం :
ఎన్నికల్లో రైతు ప్రతినిధిగా రామిరెడ్డి నిలబడ్డాడు. జమీందారు తన అభ్యర్ధిగా వెంకయ్యను నిలబెట్టాడు. రెండు పార్టీలు తమ దృష్టిని నాగాపురం మీదికి ప్రసరించాయి. ఆ గ్రామస్థుడైన నర్సిరెడ్డిని జమీందారు అభ్యర్థికే ఓటు వెయ్యమని షావుకారు కనకయ్య నిర్బంధించాడు. నర్సిరెడ్డి అందుకు ఒప్పుకోడు. షావుకారు, కరణం కలిసి దొంగ పద్దులతో అతని భూమిని లాక్కోబోతారు. ఈ విషయం జమీందారు దాకా వెళుతుంది. జమీందారు చెప్పినా నర్సిరెడ్డి తన పట్టు విడువలేదు. దాంతో అతడి కూతురి పెళ్లి సంబంధాన్ని చెడగొడతారు. నర్సిరెడ్డి కుటుంబం రైతు సేవలో లీనమైపోతుంది. నాగాపురంలో ఒక్క ఓటు కూడా వచ్చే దాఖలా లేకపోవడంతో జమీందారు వ్యూహం పన్ని కూచిపూడి భాగవతం ఏర్పాటుచేసి అందర్నీ బంధిస్తాడు. రామిరెడ్డి వాళ్లను కలిపి విషయం చెబుతాడు. రైతులు కోపంతో ఉడికిపోయి తలుపులు విరగ్గొట్టి బయటపడతారు. చివరికి రామిరెడ్డి ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాడు. జమీందారు అవమానంతో కుమిలిపోతాడు. జమీందారు నమ్మినబంటు అయిన ఖాసా సుబ్బన్న నాగాపురాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరతాడు. షావుకారు, కరణంతో చేతులు కలిపి రైతుల్ని బాధిస్తాడు. నర్సిరెడ్డి ఆస్తి జప్తు చేస్తారు. ఆ సమయంలో నర్సిరెడ్డి కొడుకు చనిపోతాడు. వరదల్లో అన్నీ కోల్పోయాక షావుకారు, కరణం పశ్చాత్తాప పడతారు. నర్సిరెడ్డితో చేతులు కలిపి జమీందారుపై ధ్వజమెత్తుతారు. చివరకు జమీందారులో పరివర్తన కలుగుతుంది.
విడుదల : 27-8-1939
నిర్మాణ ప్రాంతాలు : మద్రాసులోని ఎం.పి.పి.సి. స్టూడియో..
నిర్మాణ వ్యయం : లక్ష రూపాయలు కు పైగానే
సినిమా నిడివి : 175 నిమిషాలు..
తెరపై
నర్సిరెడ్డి : టి.రాఘవాచారి
ఖాసా సుబ్బన్న : బి.నరసింహారావు
జమీందారు : జి.వి.సీతాపతిరావు
జమీందారు
తమ్ముడు : కె.ఎన్.సిన్హా
రామజోగి : పి.సూరిబాబు
తహశ్శీల్‌ల్దారు : ఎన్.నాగరాజరావు
కరణం : వి.వి.సుబ్బయ్య
షావుకారు : ఎం.సి.రాఘవన్
రామిరెడ్డి : కె.రాఘవయ్య
జమీందారు
కొడుకు : మాస్టర్ నెహ్రూ
వెంకయ్య : ఇ.శేషయ్య
విలేజి మునసబు : జి.వెంకట్రామయ్య
కృష్ణారెడ్డి : వి.వి.సుబ్బరాజు
లక్ష్మి : పద్మావతిదేవి
సీత : సూర్యకుమారి
మహారాణి : పార్వతీబాయి
భిక్షక బాలిక : వరలక్ష్మి
ఖాసా మాత : గంగా రత్నం
రాజరత్నం : సుందరమ్మ
దాసీ సుబ్బి : సంజీవికుమారి
దాసీ : బాలాంబ..
తెర వెనుక
నిర్మాణ సంస్థ : సారథీ ఫిలింస్,
కథ : గూడవల్లి రామబ్రహ్మం
మాటలు : తాపీ ధర్మారావు నాయుడు, త్రిపురనేని గోపీచంద్
హాస్యసంభాషణలు : మల్లాది విశ్వనాధ కవిరాజు
పాటలు : కొసరాజు రాఘవయ్య చౌదరి, తాపీ ధర్మారావు,
సముద్రాల రాఘవాచార్య, తుమ్మల సీతారామమూర్తి, నెల్లూరు వెంకట్రామానాయుడు
సంగీతం : భీమవరపు నరసింహారావు,
కళా దర్శకుడు : అడుసుమిల్లి బసవయ్య చౌదరి
సహాయ దర్శకుడు : త్రిపురనేని గోపీచంద్
అసిస్టెంట్ డైరెక్టర్స్ : మాడపాటి రామచంద్రరావు, కపిల కాశీపతి,
కాటూరి జగన్మోహన్
ఛాయాగ్రహణం : శైలేన్‌బోస్, ఘటక్.
శబ్దగ్రహణం : పి.కె.విశ్వనాథం
ప్రోసెసింగ్ : శైలేన్‌బోస్ లేబొరేటరీ,
ఎం.పి.పి.పి.స్టూడియోస్
మేకప్ : ఎం.సి.రాఘవన్
ప్రొడక్షన్ మేనేజర్ : అనుముకొండ సూర్యనారాయణ
ఎడిటింగ్ : బి.నరసింహారావు
డ్యాన్స్ మాస్టర్ : ఎస్.చమన్‌లాల్
భరతనాట్యం : వేదాంతం రాఘవయ్య
(కూచిపూడి)
నిర్మాత- దర్శకుడు : గూడవల్లి రామబ్రహ్మం..
పాటలు – పద్యములు
1. నిద్రమేల్కొనరా తమ్ముడా – పి. సూరిబాబు
(రచన : కొసరాజు)
2. మంగళమమ్మా – పద్మావతిదేవి, సూర్యకుమారి
(రచన : కొసరాజు)
3. రైతుపైని అనురాగము – పి.సూరిబాబు
(రచన : కొసరాజు)
4. వాయింపు మా మురళి – సుందరమ్మ
(రచన : బసవరాజు అప్పారావు)
5. ముద్దుల యెద్దుకూ – సూర్యకుమారి
6. రాబోకు రాబోకురా – సూర్యకుమారి
(రచన : కీ||శే|| బసవరాజు అప్పారావు)
7. కన్నబిడ్డకై కళవళ – పి. సూరిబాబు
(రచన : తాపీ ధర్మారావు నాయుడు)
8. రావోయీ – వనమాలీ – సూర్యకుమారి
9. తిప్పువారికి – (పద్మావతీ దేవి)
10. పిల్లగాలికె రివ్వున ఊగే – వి.వి. సుబ్బరాజు
11. చిమ్మ చీకటులు – పి. సూరిబాబు
12. రాజు రాజ్యము – వరలక్ష్మి
13. నీలిమబ్బులు – సూర్యకుమారి
14. సై సై చిన్నపరెడ్డి – పి. సూరిబాబు
(రచన : కొసరాజు)
15. సుక్షేత్రములు దయా – పి. సూరిబాబు
(రచన : తుమ్మల సీతారామమూర్తి చౌదరి)
16. ఇన్నాళ్లవలె కాడమ్మా – వేదాంతం రాఘవయ్య
(రచన : క్షేత్రయ్య)
17. రైతుకే ఓటియ్యవలెనన్నా – అందరు
18. దారి డొంకలు – కె. రాఘవయ్య
19. శిస్తుభారము చాల – సూర్యకుమారి
20. ఓటు విలువను – పి. సూరిబాబు
21. ముందుకాలము రైతుదేనన్న – జి. వెంకట్రామయ్య
22. పాలనము నీ చేతిలోదన్నా –
23. కులముతో మనకేమి ఓలమ్మా – వరలక్ష్మి
(రచన : నెల్లూరు వెంకట్రామనాయుడు)
24. హృదయము పొంగెనుగా – సూర్యకుమారి
25. కన్నబిడ్డని నీచత్వంబున – వరలక్ష్మి
26. ఏరా! తగదురా! – పి. సూరిబాబు
(రచన : కొసరాజు)
27. జేజే బంగరుముద్దుల తండ్రీ – పార్వతీబాబు
(రచన : కొసరాజు)
28. విశ్వప్రేమయే (రచన : కొసరాజు)..
కర్టెసీ బై :
పులగం చిన్నారాయణ..