నా లైఫ్ గోడ మీద నేను గీసుకున్న స్కేల్.. చిరంజీవి..
- sekhar
- Updated on- July 22, 2020 / 04:12 PM IST
సత్యదేవ్ హీరోగా గోపీ గణేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. రీసెంట్గా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ గోపీ గణేశ్, హీరో సత్యదేవ్లను ప్రత్యేకంగా ఇంటికి పిలిచి మాట్లాడారు. వారిని అభినందించారు. ఈ విషయాన్ని హీరో సత్యదేవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిరంజీవిపై చిన్నప్పట్నుంచి ఉన్న అభిమానం. తన అభిమాన హీరో తనను అభినందించడం. ఇవన్నీ సత్యదేవ్‌కి ఎంతో హ్యాపీ మూమెంట్స్ అనే చెప్పాలి. ఆ భావాలను సత్యదేవ్ ఓ లెటర్ రూపంలో తెలియజేసి, ఆ లెటర్‌ను ట్వీట్ చేశారు.
‘‘నా చిన్నప్పుడు మా క్లాస్ రూం గోడ మీద ఒక పెద్ద స్కేల్ బొమ్మ ఉండేది. దాన్ని ఆరడుగుల దాకా గీసి ఆపేశారు. రెండు, మూడు నెలలకొకసారి ఎంత పొడవు పెరిగామో కొలవటానికి ఒక్కొక్కరినీ గోడకు అనుకుని నిలబడమనేవారు. ఒకరోజు టీచర్ని ‘మాలో ఎవరైనా ఆ సీలింగ్ కన్నా పొడవు పెరిగితే ఎలా టీచర్’ అని అడిగాను. ‘నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా’.. అన్నారు. ఆ తర్వాత చాలాసార్లు చాలా చోట్ల అవే మాటలు విన్నాను. కష్టతరం, అసాధ్యం అనిపించే పనులు చేయడానికి ఎవరు పూనుకున్నా చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు అనే మాటలు అవి. నేను సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు అదే ప్రశ్న ఎదురుపడింది.
‘నేను చిరంజీవి’ అనుకోలేదు. కొన్ని కోట్ల మందిలాగా చిరంజీవి అవ్వాలనుకుంటున్నాను. నేను ఏమీ సాధించాను? ఎంత సాధించాలి? అని కొలవటానికి నా లైఫ్ గోడ మీద నేను గీసుకున్న స్కేల్ – చిరంజీవి.
ఎవరెస్ట్ ఎక్కడానికి బయలు దేరిన ప్రతి ఒక్కడికీ అనుమానాలు, భయాలు తప్పవు. దారిలో ఊహించని అడ్డంకులు. కుంగదీసే గాయాలు. ‘ఇక నా వల్ల కాదు’ అని వెనక్కు తిరిగి పోవాలనుకున్నప్పుడు ఆ శిఖరం మీదున్న జెండా కనిపిస్తుంది. ఏదో తెలియని ధైర్యం వస్తుంది. శక్తిని పుంజుకుని మళ్లీ ప్రయాణం కొనసాగిస్తాం. తెలుగు సినిమాల్లోకి నటుడవ్వాలని వచ్చిన నాలాంటి వేల మందికి ‘చిరంజీవి’ అనే వ్యక్తి ఆ జెండా. మొన్న జూలై 8న చిరంజీవి గారిని వాళ్ల ఇంట్లో కలిశాను. ఆ యూఫోరియా నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. కలలాగానే ఉంది సర్.. మీరు నాకు చెప్పిన ప్రతి మాటా గుర్తుంది. భద్రంగా నా మనసులో దాచుకుంటాను. ‘చిరంజీవిగా రిని కలవటానికి వెళ్తున్నాను’ అని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ల నుంచి అదే ప్రశ్న ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా’ అని తన అభిమానాన్ని తెలియజేశారు హీరో సత్యదేవ్.
