Nawab Cafe Review
Nawab Cafe Review : శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని, చైతన్య కృష్ణ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా నవాబ్ కేఫ్. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధా వి పపుడిప్పు నిర్మాణంలో ప్రమోద్ హర్ష దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవాబ్ కేఫ్ సినిమా నేడు ఫిబ్రవరి 20న థియేటర్స్ లో రిలీజ్ అయింది.(Nawab Cafe Review)
రంగనాథం(రాజీవ్ కనకాల) తాతల కాలం నుంచి వచ్చిన చాయ్ బిజినెస్ నవాబ్ కేఫ్ ని నడుపుతూ ఉంటాడు. అతని కొడుకు రాజా(శివ కందుకూరి) అమెరికా వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఈ పాత కేఫ్ వద్దు అని కలలు కంటూ తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో సఖి(తేజు అశ్విని)తో పరిచయం అయి ప్రేమలో పడతాడు. రంగనాథం అన్న కొడుకు బిజినెస్ మెన్ కుమార్(చైతన్య కృష్ణ) రాజాకి డబ్బు ఆశ చూపించి హైదరాబాద్ సెంటర్లో ఉన్న నవాబ్ కేఫ్ స్థలాన్ని కొనాలని, అక్కడ కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేస్తాడు.
దీంతో రాజా తండ్రితో ఎందుకూ పనికిరాని ఆ కేఫ్ అమ్మేయమని గొడవపడతాడు. తన డబ్బు పిచ్చితో సఖికి కూడా దూరమవుతాడు రాజా. మరి నవాబ్ కేఫ్ ని అమ్మేస్తారా? అసలు నవాబ్ కేఫ్ చరిత్ర ఏంటి? రాజా తండ్రిని అర్ధం చేసుకుంటాడా? రాజా – సఖి మళ్ళీ కలుస్తారా? నవాబ్ కేఫ్ కోసం కుమార్ వేసే కన్నింగ్ ప్లాన్స్ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Bookie Review : ‘బూకీ’ మూవీ రివ్యూ.. సాగదీసిన బ్రేకప్ కథ.. మంచు లక్ష్మి నటించిన తమిళ సినిమా ఎలా ఉందంటే..
మొదట చాయ్ వాలా అంటూ తండ్రి ఎమోషన్ కథ అని ప్రమోట్ చేసారు. చివర్లో సెన్సార్ అభ్యంతరాలతో నవాబ్ కేఫ్ అని పేరు మార్చారు. అసలు నవాబ్ కేఫ్ చరిత్ర ఏంటి అని సినిమా మొదట్లోనే చెప్పి ఆసక్తి నెలకొల్పుతారు.
ఫస్ట్ హాఫ్ అంతా ఓ చాయ్ షాప్ ని నడుపుతున్న తండ్రి, చిల్లరగా తిరిగే కొడుకు, అతని ప్రేమకథతో సాగుతుంది. డబ్బు, లగ్జరీ మీద ఇంట్రెస్ట్ తో ఆ కేఫ్ ని అమ్మేయాలనుకుంటాడు. ఇంటర్వెల్ కి ఓ ఎమోషనల్ ట్విస్ట్ ఇస్తారు కానీ ఆ ట్విస్ట్ ఊహించేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్ హీరో ఎలా మారాడు, తన కేఫ్ ని ఎలా కాపాడుకున్నాడు, తన బిజినెస్ ని ఎలా పెంచాడు అని సాగుతుంది. ఇది చాలా సినిమాల్లో ఉన్న రొటీన్ కథే.
ఇటీవల వచ్చిన ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా కథ, అందులోని తండ్రి ఎమోషన్, కొన్ని సీన్స్ ఈ సినిమాలో అచ్చు దింపేశారు. అందులో ఇడ్లీ కొట్టు అయితే ఇక్కడ చాయ్ షాప్ అంతే తేడా. ఇక జనతా హోటల్, కీర్తి సురేష్ మిస్ ఇండియా.. లాంటి పలు సినిమాల్లోని కథనం, సీన్స్.. ఈ సినిమాలో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ ఫ్రెండ్ కామెడీ సీన్స్, లవ్ స్టోరీతో సాగి బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందు నుంచే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంటుంది.
ఇక సెకండ్ హాఫ్ ప్రతి సీన్ ఊహించేయొచ్చు. సినిమా అయిపోయింది అనుకునేలోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ కాసేపు సాగదీస్తారు. ఆ ట్విస్ట్ కూడా ఊహించేయొచ్చు. తండ్రి ఎమోషన్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఒకటి రెండు సీన్స్ లో కన్నీళ్లు పెట్టిస్తారు. రాజ్ కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ సీన్స్ కొన్ని కంటిన్యుటీ మిస్ అయ్యాయి.
శివ కందుకూరి బాగానే నటించాడు. తేజు అశ్విని క్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది. రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో అదరగొట్టారు. ఎమోషనల్ గా మెప్పించారు. రాజ్‌కుమార్ కసిరెడ్డి అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. చైతన్య కృష్ణ నెగిటివ్ పాత్రలో పర్వాలేదనిపించారు. వడ్లమాని శ్రీనివాస్, మణిచందన.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Hey Balwanth Review : ‘హే బల్‌వంత్’ మూవీ రివ్యూ.. ఇంతకీ ఏం బిజినెస్ తెలుసా?
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ యావరేజ్. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. దర్శకుడు పాత పాయింట్ నే తీసుకున్నా తండ్రి ఎమోషన్ బాగా వర్కౌట్ చేసి తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘నవాబ్ కేఫ్’ తండ్రి వ్యాపారాన్ని కొడుకు తీసుకునే ఎమోషనల్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.