హాలీవుడ్‌కి హాయ్ చెప్పనున్నఅలీ

హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ..

  • Publish Date - January 29, 2020 / 05:13 AM IST

హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ..

అలీ.. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘సీతాకోకచిలుక’ సినిమాతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటినుండి నేటి వరకు నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. హాస్యనటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టెలివిజన్ హోస్టుగా పలు విభిన్న పాత్రలు పోషిస్తూ.. తనకున్న దానిలో సమాజసేవ చేస్తూ.. వివాదాలకు దూరంగా ఉంటూ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’లో కానిస్టేబుల్ రాజుగా కనిపించిన అలీ త్వరలో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

దర్శకుడు జగదీష్‌ దానేటి దర్శకత్వంలో అలీ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్రబృందం మీడియాకు వెల్లడించింది. ఒక స్ట్రయిట్‌ హాలీవుడ్‌ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్‌ దానేటి.. ఈ ఇండో హాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్‌ ఫిల్మ్స్, పింక్‌ జాగ్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా షూటింగ్ పనులు, అనుమతుల నిమిత్తం నటుడు అలీ, దర్శకుడు జగదీష్‌.. సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిశారు.

Read Also : లిప్ లాక్ సీన్స్ సక్సెస్ ఇవ్వవు – నిర్మాత రాజ్ కందుకూరి

అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘హాలీవుడ్‌ సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. హాలీవుడ్‌ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్‌ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు. జగదీష్‌ మాట్లాడుతూ.. ‘ఇండో హాలీవుడ్‌ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్‌లో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని తెలిపారు.