Saraswathi Movie Review
Saraswathi Movie Review : వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో నటిస్తూ తన దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా సరస్వతి. దోస డైరీస్ బ్యానర్ పై పూజా శరత్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, ప్రియమణి,రావు రమేష్, రాధికా శరత్ కుమార్, మురళి శర్మ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సరస్వతి సినిమా మార్చ్ 6న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
భర్తతో విడిపోయిన లక్ష్మి(వరలక్ష్మి శరత్ కుమార్) ఓ హాస్పిటల్ లో నర్సింగ్ జాబ్ చేసుకుంటూ తన పాపతో కలిసి ఉంటుంది. ఆగస్టు 15 తన కూతురు పుట్టిన రోజు, స్వాతంత్ర దినోత్సవం నాడు కూతురు సరస్వతి(నివేక్ష)ని స్కూల్ దగ్గర వదిలేసి హాస్పిటల్ కి వెళ్తుంది. సాయంత్రం స్కూల్ కి వచ్చేసరికి స్కూల్ లో పాప ఉండదు. అసలు అలాంటి పాప ఆ స్కూల్ లోనే లేదని అక్కడి పిల్లలు, స్టాఫ్ చెప్తారు. ఆ రోజు రాత్రి సరస్వతి లక్ష్మికి కాల్ చేసి ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నాను, ఇంకో ఇద్దరు అంకుల్స్ ఉన్నారు భయమేస్తుంది అని చెప్పడంతో లక్ష్మి అక్కడికి వెళ్తుంది. అప్పటికే సరస్వతి పై రేప్ జరిగి చనిపోయి ఉంటుంది.
లక్ష్మి తన కూతురు సరస్వతి శవాన్ని ఓ స్మశానంలో పాతిపెట్టి తెల్లారి పోలీసుల దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. వచ్చి చూస్తే స్మశానంలో పాప శవం ఉండదు. అసలు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, అసలు పాపే లేకుండా కేసు ఎలా ఫైల్ చేస్తాం అని పోలీసులు వదిలేయడంతో కోర్టు చుట్టూ తిరుగుతుంది. కొన్నాళ్ళకు సిన్సియర్ లాయర్ రామానుజం(ప్రకాష్ రాజ్) ఈ కేసుని తీసుకుంటాడు. అసలు ఎలాంటి ఎవిడెన్స్, పాప సరస్వతి కూడా లేకుండా ఈ కేసును ఎలా డీల్ చేసారు? అసలు సరస్వతి ఏమైంది? లక్ష్మి తన కూతురు కోసం ఏం చేసింది? అసలు రేప్ చేసిన ఆ ముగ్గురు ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also See : Nayanika Reddy : పెళ్లి కూతురు వేడుక.. అల్లు శిరీష్ కాబోయే భార్య నయనిక రెడ్డి ఫొటోలు..
నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా, నిర్మాతగా మారి సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఓ మెసేజ్ ఇచ్చే సినిమాగా సరస్వతిని తెరకెక్కించింది. ఫస్ట్ హాఫ్ అంతా లక్ష్మి పాప మిస్ అయిందని తిరగడం, రామానుజం దగ్గరకు వెళ్లడం, లక్ష్మి భర్త గురించి, లక్ష్మి చేసే పనులతో కాస్త ఎమోషనల్ గా సాగదీశారు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ సాగదీశారు. సీరియస్ గా కథ నడుస్తుంటే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ సాంగ్ అక్కర్లేకుండా పెట్టారు. ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్ ఇచ్చినా రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు ఆ ట్విస్ట్ ఊహించేయొచ్చు.
ఇక సెకండ్ హాఫ్ లో లక్ష్మి కేసు కోర్టు విచారణలు, ఓ ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఊహించేయొచ్చు. క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఇచ్చినా అది కూడా గెస్ చేయొచ్చు. సమాజంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల కథతో సస్పెన్స్ గా రాసుకొని ట్విస్టులతో ఓ మెసేజ్ ఇస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. కానీ ఇందులో వచ్చే ట్విస్టులన్నీ ముందే ఊహించేయొచ్చు.
అసలు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే కథ అర్ధమయిపోయింది. ట్రైలర్ లోనే కథ చెప్పేసారు. ట్రైలర్ ఇంకో విధంగా కట్ చేస్తే బాగుండు. స్క్రీన్ ప్లే సాగదీసినా, ట్విస్ట్ లు ముందే ఊహించినా టేకింగ్ మాత్రం బాగుంది. కొన్ని చోట్ల ఎమోషనల్ గా వర్కౌట్ అయింది. అయితే ఇది కమర్షియల్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. స్క్రీన్ ప్లే విషయంలో క్షణం, ఎవరు.. లాంటి సినిమాలు గుర్తొస్తాయి. మూవీ టీమ్ అంతా తమిళ్ అయినా ఈ సినిమాని కేవలం తెలుగులోనే తెరకెక్కించి తమిళ్ లో లేకుండా ఇక్కడే రిలీజ్ చేయడం గమనార్హం.
మెయిన్ లీడ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టేసింది. ఈ పాత్రలో తన బెస్ట్ ఇచ్చింది. వరలక్ష్మి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లలో ఒకటని చెప్పొచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ నివేక్ష ఇలాంటి పాత్ర చేయడం అంటే సాహసమనే చెప్పాలి. నటనతో అందర్నీ మెప్పిస్తుంది నివేక్ష.
ప్రియమణి కూడా ఓ ఎమోషనల్ పాత్రలో బాగా మెప్పించింది. సిన్సియర్ లాయర్ గా ప్రకాష్ రాజ్ మెప్పించారు. హీరో జీవా లక్ష్మి భర్త పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. రాధికా శరత్ కుమార్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. రావు రమేష్, మురళి శర్మ, గెటప్ శ్రీను, సప్తగిరి, తులసి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు. OG సినిమాలో మిగిలిన కొన్ని ట్రాక్స్ ఈ సినిమాకు వాడారేమో తమన్ అనే సందేహం కలుగుతుంది. రెగ్యులర్ కథే అయినా కాస్త కొత్త స్క్రీన్ ప్లేతో బాగానే రాసుకొని తెరెకెక్కించారు. సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో లవ్ సాంగ్, అక్కడక్కడా ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సరస్వతి’ సినిమా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన కథతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.