Bharathiraja : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా క‌న్నుమూత‌..

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా (Bharathiraja) క‌న్నుమూశారు.

Veteran actor filmmaker Bharathiraja dies at 84

Bharathiraja : ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా క‌న్నుమూశారు. గ‌త కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్యంతో బాధ‌డుతున్న ఆయ‌న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 84 సంవ‌త్స‌రాలు. ఈ ఘ‌ట‌న‌తో త‌మిళ‌, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ షాక్‌లోకి వెళ్లిపోయింది. ఆయ‌న అభిమానులు, ప‌లువురు సినీ, రాజ‌కీయ నాయ‌కులు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

1977లో వ‌చ్చిన త‌మిళ మూవీ 16 వ‌య‌థినిలే తో ఆయ‌న ద‌ర్శ‌కుడిగా మారారు. తమిళంలోనే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ ఆయన తన చెరగని ముద్రను వేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతాకోకచిలుక’ ఇక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’ వంటి చిత్రాలు ఆయనలోని వైవిధ్యాన్ని, సామాజిక స్పృహను చాటిచెప్పాయి. కథలో ఉండే భావోద్వేగాలను వెండితెరపై పండించడంలో ఆయన శైలి ఎందరో యువ దర్శకులకు నేటికీ ఒక పాఠ్యపుస్తకం లాంటింది.

*RC17 స్టోరీపై క్రేజీ అప్‌డేట్.. సుకుమార్ అసిస్టెంట్ హుస్సేన్ షా కిరణ్ సెన్సేషనల్ కామెంట్స్

దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ భారతీరాజా తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. వయసుతో నిమిత్తం లేకుండా స్క్రీన్ పై నెగెటివ్ పాత్రల్లోనూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించారు. మణిరత్నం ‘యువ’ చిత్రంలో రాజకీయ నాయకుడిగా ఆయన నటన అద్భుతం. అలాగే ‘సీతకత్తి’, ‘ఈశ్వరన్’, ‘సార్’, ‘తిరు’, ఇటీవలి బ్లాక్‌బస్టర్ ‘మహారాజా’ వంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి నటుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు.

భారతీరాజా సినీ రంగానికి చేసిన అసమాన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ (సౌత్) అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు, పలు తమిళనాడు రాష్ట్ర అవార్డులను అందుకున్నారు.  కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల కెరీర్‌ను మలుపు తిప్పడంలో, అలాగే రాధిక, రేవతి వంటి మేటి నటీమణులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం.

కుంగ‌దీసిన కుమారుడి మ‌ర‌ణం..

ఆయ‌న కుమారుడు న‌టుడు మ‌నోజ్ భార‌తీరాజా (48) మార్చి 2025లో గుండెపోటుతో మ‌ర‌ణించారు. కుమారుడి మృతితో భార‌తీరాజా కృంగిపోయారు. ఆ బాధ నుంచి ఆయ‌న తేరుకోలేక‌పోయారు.