×
Ad

Bookie Review : ‘బూకీ’ మూవీ రివ్యూ.. సాగదీసిన బ్రేకప్ కథ.. మంచు లక్ష్మి నటించిన తమిళ సినిమా ఎలా ఉందంటే..

తమిళ్ లో పూకీ అనే పేరుతో గతవారమే రిలీజ్ అవ్వగా ఈ వారం తెలుగులో బూకీ అనే పేరుతో ఎలాంటి అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా సింపుల్ గా రిలీజ్ అయింది. (Bookie Review)

  • Published On : February 20, 2026 / 05:59 PM IST

Bookie Review

Bookie Review : విజయ్ యాంటోని మేనల్లుడు అజయ్ దిషన్ హీరోగా, ధనుషా హీరోయిన్ గా తమిళ్ లో తెరకెక్కిన సినిమా పూకీ. దీన్ని తెలుగులో బూకీ అనే పేరుతో రిలీజ్ చేసారు. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మాణంలో గణేష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్ లో గతవారమే రిలీజ్ అవ్వగా తెలుగులో నేడు ఫిబ్రవరి 20న థియేటర్స్ లో రిలీజయింది.(Bookie Review)

కథ విషయానికొస్తే..

కైలాష్( అజయ్ దిషన్) – ఆశ(ధనుషా) ఆరేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఓ విషయంలో గొడవ అయి అది పెద్దగా మారి రోడ్డు మీద ఒకర్నొకరు కొట్టుకుంటారు. దాంతో రోడ్డు మీద జనాలు వీళ్ళు కొట్టుకున్నది వీడియో తీసి వైరల్ చేస్తారు. అక్కడితో వీళ్ళిద్దరూ విడిపోతారు. ఈ బ్రేకప్ బాధ నుంచి బయటపడటానికి ఆశ తిండి, షాపింగ్, దైవం అంటూ తిరిగితే కైలాష్ జిమ్, సినిమాలు అని తిరుగుతాడు.

ఇద్దరూ వీళ్ళ ప్రేమని మర్చిపోవడానికి ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతారు. అదే సమయంలో ఆశ లైఫ్ లోకి రాహుల్(అశ్విన్ రామ్), కైలాష్ లైఫ్ లోకి కావ్య(షియారా షర్మి) వస్తారు. మరి కైలాష్ – ఆశ మొత్తానికి విడిపోతారా? అసలు వీళ్ళ బ్రేకప్ లైఫ్ ఎలా సాగింది? వీళ్ళ లైఫ్ లోకి వచ్చిన కొత్తవాళ్లతో ప్రేమలో పడతారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Hey Balwanth Review : ‘హే బల్‌వంత్‌’ మూవీ రివ్యూ.. ఇంతకీ ఏం బిజినెస్ తెలుసా?

సినిమా విశ్లేషణ..

విజయ్ యాంటోని నిర్మాతగా తన మేనల్లుడుని హీరోగా పెట్టి ఈ సినిమా తీసాడు. తమిళ్ లో పూకీ అనే పేరుతో గతవారమే రిలీజ్ అవ్వగా ఈ వారం తెలుగులో బూకీ అనే పేరుతో ఎలాంటి అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా సింపుల్ గా రిలీజ్ అయింది.

సినిమా ఓపెనింగ్ లోనే ఇద్దరూ విడిపోవడంతో ఆసక్తికరంగా మొదలవుతుంది కథ. కానీ బ్రేకప్ తర్వాత వీళ్ళు చేసే పనులన్నీ విడివిడిగా సీన్స్ రాసుకొని అవన్నీ కైలాష్, ఆశ వైపు నుంచి చెప్పిస్తారు. ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వీళ్ళ లైఫ్ లోకి ఇంకొకరు వచ్చిన తర్వాత ఎలా మారతారు అనేది క్యూట్ లవ్ స్టోరీలుగా కాసేపు చూపించి మళ్ళీ పాత ప్రేమకథకు తీసుకెళ్తారు.

చాలా సీన్స్ సాగదీశారు. అక్కర్లేని సీన్స్, సాంగ్స్ చాలానే ఉన్నాయి. అసలు సునీల్ ఎపిసోడ్ మొత్తం లేకపోయినా సినిమా నడుస్తుంది కానీ ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి. బ్రేకప్ అయితే అమ్మాయిలు, అబ్బాయిలు ఏం చేస్తారు అనే సీన్స్ కి మాత్రం లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు బాగానే కనెక్ట్ అవుతారు. తండ్రి ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. అక్కడక్కడా కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసారు. బ్రేకప్ ఎమోషనల్ సీన్స్ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ మళ్ళీ మాములే. సింపుల్ గా ఓ ప్రేమజంట బ్రేకప్ – ప్యాచప్ కథని బాగా సాగదీసి చూపించారు. ఇంతకీ బూకీ/పూకీ అంటే ప్రేమికులు ఒకర్నొకరు క్యూట్ గా పిలుచుకునే పదం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

అజయ్ దిషన్, ధనుషా పోటీపడి మరీ నటించారు. క్యూట్ గా అనిపిస్తునే అక్కడక్కడా నవ్వించారు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం పర్వాలేదనిపించారు. అశ్విన్ రామ్, షియారా షర్మి వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. సునీల్ ఓ స్వామిజి పాత్రలో పర్వాలేదనిపించారు. మంచులక్ష్మీ సైకాలజిస్ట్ పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. కనపడేది కాసేపే అయినా తన ఎక్స్‌ప్రెషన్స్ తో నవించే ప్రయత్నం చేసింది. విజయ్ యాంటోని ఓ సాంగ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. మిగిలిన తమిళ నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. విజయ్ యాంటోని ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు మాత్రం ఒక్కటి కూడా తెలుగు డబ్బింగ్ లో సింక్ అవ్వలేదు. ఎడిటింగ్ బాగుంది. ఇది కూడా విజయ్ యాంటోనినే చేయడం గమనార్హం. కథ ఏమి లేకపోయినా సీన్స్, డైలాగ్స్ తో రెండు గంటలు సాగదీయడం అంటే మాములు విషయం కాదు. డైరెక్టర్ కాస్త బోర్ కొట్టించినా స్క్రీన్ ప్లే, మాటలు బాగా రాసుకున్నారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా బూకీ ఓ ప్రేమజంట బ్రేకప్ తర్వాత జరిగే కథ. ఓపిక ఉంటే మీ ఫ్రెండ్స్, లవర్స్ తో కలిసి చూడొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.