Funky Review : ‘ఫంకీ’ మూవీ రివ్యూ.. జాతి రత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా.. నవ్వించారా..?
నేనింతే సినిమాకు కామెడీ వర్షన్ ఫంకీ. కాసేపు నవ్వుకోడానికి వెళ్లొచ్చు. (Funky Review)
Funky Review
Funky Review : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కయదు లోహర్ జంటగా తెరకెక్కిన సినిమా ఫంకీ. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా తెరకెక్కింది. ఫంకీ సినిమా నేడు ఫిబ్రవరి 13న థియేటర్స్ లో రిలీజయింది.(Funky Review)
కథ విషయానికొస్తే..
కోమల్(విశ్వక్ సేన్) ఎమోషన్స్ ని పెద్దగా పట్టించుకోని డైరెక్టర్. తన ఫస్ట్ సినిమా నాలుగు కోట్లలో తీస్తా అని చెప్పి బడ్జెట్ ని భారీగా పెంచేస్తాడు. కోమల్ బడ్జెట్ పెంచేయడంతో ప్రొడ్యూసర్(నరేష్) హెల్త్ పాడవుతుంది. దీంతో నిర్మాత కూతురు చిత్ర( కయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. చిత్ర కోమల్ కి మొదట సినిమా ఆపేస్తామని చెప్తుంది. కోమల్ సినిమా అయినా తీయండి లేదా నన్ను లవ్ చేయండి అని వెంటపడతాడు. దీంతో చిత్ర ఎలాగైనా కోటి రూపాయల్లో కోమల్ తో మిగిలిన సినిమా పూర్తి చేయిస్తానని తన తండ్రికి చెప్పి సినిమా షూటింగ్ మొదలుపెట్టిస్తుంది.
మరి కోటి రూపాయల్లో మిగతా సినిమా షూటింగ్ పూర్తయిందా? కోమల్ ఫస్ట్ సినిమా రిలీజయిందా? కోమల్ చిత్ర నిజంగానే ప్రేమలో పడతారా? అసలు కోమల్ ఎమోషన్స్ లేకుండా ఎందుకు ఉంటాడు? ఈ సినిమా పూర్తి చేసే క్రమంలో మూవీ టీమ్ ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Nilave Review : ‘నిలవే’ మూవీ రివ్యూ.. బ్యూటిఫుల్ విజువల్స్ తో కొత్తరకం ప్రేమకథ..
సినిమా విశ్లేషణ..
జాతి రత్నాలు అనుదీప్ తో విశ్వక్ సేన్ సినిమా, అందులో రీసెంట్ సెన్సేషన్ కయదు లోహర్ హీరోయిన్ అని ప్రకటించడం, ఫంకీ అనే టైటిల్ ప్రకటించిన దగ్గర్నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకు భారీగానే చేసారు. ముందు నుంచే కేవలం నవ్వుకోడానికి మాత్రమే ఈ సినిమాకు రండి, లాజిక్స్, కథ లాంటివి వెతక్కండి అని చెప్తూనే వచ్చారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా బ్యాక్ డ్రాప్ లో రవితేజ నేనింతే సినిమా వచ్చింది. అది సీరియస్ సినిమా అయితే ఇది కామెడీ సినిమా.
సినిమా మొదట్లోనే కోమల్ సినిమా బడ్జెట్ పెరిగి నిర్మాత హెల్త్ అప్సెట్ అవ్వడం, కూతురు దిగడం, కోమల్ చిత్ర వెంట పడి నానా తంటాలు పడి సినిమా షూటింగ్ మొదలవ్వడంతో అక్కడక్కడా కామెడీ పంచులతో సాగుతుంది. ఈమధ్యలో కోమల్ – చిత్ర మధ్య ప్రేమ సన్నివేశాల్లాంటివి వస్తుంటాయి. విలన్ ఎంట్రీతో ఇంటర్వెల్ సింపుల్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా ఎలా పూర్తిచేశారు అని సాగుతుంది. సినిమా అంతా ఎక్కువగా పంచ్ డైలాగ్స్ మీదే నడుస్తుంది. ముందే చెప్పినట్టు లాజిక్స్ అడక్కూడదు. ఇది సింపుల్ కథే.
సినీ పరిశ్రమలో జరిగే పరిస్థితులపై, ఇప్పటి సినిమాలపై బాగానే కౌంటర్లు వేశారు. సినిమాకు బడ్జెట్ లేకపోతే పడే కష్టాలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పడే కష్టాలు కూడా కామెడీగా చూపించారు. విలన్(సంపత్ రాజ్) ట్రాక్ కాస్త సీరియస్ గా ఉంటే బాగుండేది కానీ అది కూడా కామెడీ చేయడం, విలన్ ట్రాక్ ని బాగా సాగదీయడంతో విలన్ ట్రాక్ అంతగా వర్కవుట్ అవ్వలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మాత్రం అమ్మ సెంటిమెంట్ తో కాస్త కన్నీళ్లు పెట్టిస్తారు. హీరో పాత్ర ఎమోషన్స్ లేకుండా ఎందుకు అలా ఉన్నాడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. బడ్జెట్ పెరిగిన రీజన్స్ కరెక్ట్ గా చెప్పినా అది ఇంకాస్త ఎమోషనల్ గా వర్కౌట్ చేసి ఉంటే హీరో క్యారెక్టర్ ఇంకాస్త కనెక్ట్ అయ్యేది ప్రేక్షకులకు.
ఈ సినిమా చూస్తుంటే అనుదీప్, నాగ్ అశ్విన్, పలువురు దర్శక నిర్మాతల జీవితాల్లో జరిగిన సంఘటనలతో కామెడీగా రాసుకున్నారేమో అనిపిస్తుంది. పలువురు దర్శక నిర్మాతలు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం గమనార్హం. సినీ పరిశ్రమలోని పరిస్థితులను తీసుకొని డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతుర్ని లవ్ చేసిన కథతో ఫంకీ సినిమాని కామెడీ కథాంశంతో తెరకెక్కించారు. సినిమా నిడివి రెండు గంటలే కావడం మంచి విషయం. నేనింతే సినిమాకు కామెడీ వర్షన్ ఫంకీ. కాసేపు నవ్వుకోడానికి వెళ్లొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
విశ్వక్ తన మాస్ పాత్రని పక్కన పెట్టి కొత్తగా కనిపించాడు. కయదు లోహర్ తన అందంతో ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. నటనలో పర్వాలేదనిపిస్తుంది. సీనియర్ నటుడు నరేష్ బాగానే నవ్వించారు. ఈశ్వరి రావు తల్లి పాత్రలో ఎమోషన్ పండించింది. అదితి భావరాజు, పమ్మి సాయి, గోపి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
సంపత్ రాజ్ పాత్ర కాస్త ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ అనుదీప్, కళ్యాణ్ శంకర్, మారి, హరీష్ శంకర్ గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చి నవ్వించే ప్రయత్నం చేసారు. నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజు కూడా గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చి మెరిపించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా కలర్ ఫుల్ గా రిచ్ గా ఉండేలా చూసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక్క పాట తప్ప మిగిలిన పాటలన్ని మెప్పిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. సింపుల్ కథని, తన లైఫ్ లో చూసిన సంఘటనలను కామెడీగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు అనుదీప్. కొన్ని పంచ్ డైలాగ్స్ అక్కడక్కడా నవ్వించినా కొన్ని మాత్రం వర్కౌట్ అవ్వలేదు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఫంకీ’ సినిమా పరిశ్రమలో జరిగే సంఘటనలకు ఓ దర్శకుడు, నిర్మాత కూతురు ప్రేమకథని జోడించి ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
