LPG Cylinder Delivery : ఇకపై స్విగ్గీలో ఎల్పీజీ సిలిండర్.. బుకింగ్ చేసిన పది నిమిషాల్లోనే..

LPG Cylinder Delivery : పది నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లను ఇంటికి సరఫరా చేసేలా క్విక్ కామర్స్ సంస్థ ఇన్‌స్టామార్ట్‌తో హెచ్‌పీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.

LPG Cylinder Delivery

LPG Cylinder Delivery : ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ విధానంలో భారీ మార్పు రానుంది. ఇప్పటివరకు సిలిండర్ బుక్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఇకపై కేవలం 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు చేరేలా హెచ్‌పీసీఎల్ (HPCL), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ భాగస్వామ్యంతో ప్రారంభిస్తోంది. తొలిదశలో ఈ సేవ బెంగళూరులో అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో ఇతర నగరాలకు కూడా విస్తరించే అవకాశమున్నప్పటికీ, దీనిపై సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read : AP Government : ఏపీలో మరో కొత్త పథకం అమలుకు సిద్ధమైన సర్కార్.. ఒక్కొక్కరికి రూ.25వేలు సాయం

క్విక్ కామర్స్ రంగంలో మరో కీలక అడుగు పడింది. ఇప్పటివరకు కిరాణా, కూరగాయలు, ఎలక్ట్రానిక్ వస్తువులను డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను కూడా వినియోగదారుల ఇంటి వద్దకే అందించనుంది. ఇందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. హెచ్‌పీసీఎల్‌కు చెందిన 10 కేజీల నవ్య సిలిండర్లు బుక్ చేసుకున్న పది నిమిషాల్లోనే కస్టమర్ల ఇంటికి చేరుకుంటాయి.

గ్యాస్ కనెక్షన్ లేనివారు, చిన్న కుటుంబాలు, విద్యార్థులకు అనువుగా హెచ్‌పీసీఎల్ సంస్థ నవ్య గ్యాస్ సిలిండర్ లను రూపొందించింది. సాధారణంగా స్టీల్ సిలిండర్ల కంటే భిన్నమైన కాంపోజిట్ పాలిమర్ తో నవ్య సిలిండర్లను తయారు చేశారు. పాక్షిక పారదర్శకంగా ఉండే ఈ సిలిండర్లలో గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయో చూస్తే తెలిసిపోతుంది. అంతేకాదు.. సాధారణ స్టీల్ సిలిండర్ల కంటే ఇవి 50శాతం బరువు తక్కువగా ఉంటాయి.

డెలివరీ ఎలా చేస్తారంటే?
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో బుక్ చేసినప్పటికీ డెలివరీ మాత్రం సంబంధిత హెచ్‌పీసీఎల్ గ్యాస్ ఏజెన్సీల ద్వారానే జరుగుతుంది. శిక్షణ పొందిన సిబ్బంది సిలిండర్‌ను ఇంటికే తీసుకొచ్చి అందజేస్తారు. అయితే, మొదటిసారి సిలిండర్ తీసుకునే వినియోగదారులు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం జరిగే బుకింగ్‌లను రీఫిల్‌గా పరిగణిస్తారు. ప్రతి రీఫిల్ డెలివరీ సమయంలో ఖాళీ నవ్య సిలిండర్‌ను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా హెచ్‌పీసీఎల్ మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అమిత్ గర్గ్ మాట్లాడుతూ.. ఎల్‌పీజీ సేవలను మరింత వేగంగా, సులభంగా ప్రజలకు అందించడమే ఈ సేవ లక్ష్యమని తెలిపారు.