TN CM Vijay: కిరాణ సరుకుల కోసం వెళ్లిన పదేళ్ల బాలిక దారుణ హత్య.. సీఎం విజయ్ సీరియస్
ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోము అని తేల్చి చెప్పారు. మహిళలు, పిల్లలపై ఘోరాలకు ఒడిగట్టే వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
- Naveen
- Updated on- May 23, 2026 / 06:22 PM IST
TN CM Vijay: తమిళనాడులోని కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య ఘటనపై సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు. బాధిత కుటుంబసభ్యులకు సర్కార్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు సీఎం విజయ్.
కోయంబత్తూరు సూలూర్ ఏరియాలో కిరాణ సరుకులు తేవటానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇవాళ చెరువు సమీపంలో మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోము అని తేల్చి చెప్పారు. మహిళలు, పిల్లలపై ఘోరాలకు ఒడిగట్టే వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా తమిళనాడు ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని విజయ్ స్పష్టం చేశారు.
బాలిక హత్య ఘటనతో తమిళనాడు వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. కొత్త ప్రభుత్వంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. సీఎం విజయ్ పదవి చేపట్టిన 12 రోజుల్లోనే నేరాలు పెరిగాయని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు.
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ వేగవంతం చేయడానికి తమిళనాడు డీజీపీ స్వయంగా కోయంబత్తూరు వెళ్లారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని తీసుకోబోము అని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసుపత్రికి వెళ్లి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
అసలేం జరిగింది?
మే 21న బాలిక అదృశ్యమైంది. బాలిక కోసంపలుమార్లు విస్తృతంగా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలిక కోసం గాలించారు. అదే సమయంలో కన్నంపాలయంలోని ఒక నీటి ట్యాంక్ సమీపంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
బాధితురాలి ఇంటి పక్కనే ఉండే ప్రధాన నిందితుడు కార్తీక్.. ఆ చిన్నారిని తనతో పాటు తీసుకెళుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయని పోలీసులు తెలిపారు. 33 ఏళ్ల కార్తీక్, సహ నిందితుడు మోహన్‌రాజ్ ఇద్దరూ రోజువారీ కూలీలని, ఘటనకు ముందు, తర్వాత కార్తీక్ మోహన్‌రాజ్‌ను సంప్రదించడంతో అతనే ఈ నేరంలో కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
