Pooja In Train Coach: మొన్న శోభనం.. ఇప్పుడు పూజలు.. రైల్లో పూజకి అన్ని లక్షలు అయిందా?
రైలు బోగీ(Pooja In Train Coach)లో పూజారి ఆధ్వర్యంలో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్న వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.
- V Santhosh Kumar
- Published on- July 13, 2026 / 02:30 PM IST
3 lakh for pooja in train coach Railways officials response to viral video
- రైలులో పూజలపై క్లారిటీ.
- ప్రైవేట్ సెలూన్ కార్ బుకింగ్.
- ప్రయాణికుల భద్రతకు ఢోకా లేదు.
Pooja In Train Coach: ఇటీవల సోషల్ మీడియాలో ఒక రైలు బోగీలో పూజారి ఆధ్వర్యంలో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్న వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. సాధారణ ప్యాసింజర్ రైలులోనే ఈ క్రతువు నిర్వహించారంటూ నెటిజన్లు దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో పెద్ద వివాదం చెలరేగింది. భారతీయ రైల్వేలో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉందా అంటూ నెట్ ఇంట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ వివాదంపై స్పందించిన ఉత్తర రైల్వే (Northern Railway), సోషల్ మీడియా వేదికగా అసలు నిజాన్ని వెల్లడిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సెలూన్ కార్ బుకింగ్.. అసలు కథ ఇదే:
వైరల్ అయిన వీడియో సాధారణ ప్రయాణికుల బోగీ(Pooja In Train Coach)కి సంబంధించినది కాదని, అది ఐఆర్‌సీటీసీ (IRCTC) ద్వారా కమర్షియల్‌గా బుక్ చేసుకున్న ఒక ప్రైవేట్ ‘సెలూన్ కార్’ అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. జూలై 8న ఒక ప్రైవేట్ పార్టీ రూ3,08,580 అడ్వాన్స్ చెల్లించి ఈ లగ్జరీ కోచ్‌ను బుక్ చేసుకుంది. జూలై 10న న్యూఢిల్లీ నుంచి ముంబై వెళ్లే పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ కు ఈ సెలూన్ కార్‌ను అనుసంధానించారు. ఈ ప్రైవేట్ కార్యక్రమం వల్ల సాధారణ రైలు సర్వీసులకు లేదా ప్రయాణికుల భద్రతకు, సౌకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని అధికారులు వివరించారు.
అసలు ఈ రైల్వే సెలూన్ కార్ అంటే ఏమిటి?
సాధారణంగా రైల్వే సెలూన్ కార్ అనేది ప్రత్యేక సదుపాయాలు ఉన్న ఒక ప్రైవేట్ లగ్జరీ కోచ్. గతంలో వీటిని కేవలం సీనియర్ రైల్వే అధికారులు, ప్రముఖుల (విఐపి) ప్రయాణాల కోసం మాత్రమే కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఐఆర్‌సీటీసీ ద్వారా ఎవరైనా దీనిని ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్‌రూమ్‌లు, లివింగ్ రూమ్, డైనింగ్ ఏరియా, వంటగది, అటాచ్డ్ బాత్‌రూమ్‌లు ఉంటాయి. సాధారణ ప్రయాణికులతో సంబంధం లేకుండా, ప్రత్యేకంగా సొంత కోచ్‌లో ప్రయాణించాలనుకునే వారు ఈ లగ్జరీ సదుపాయాన్ని వినియోగించుకుంటారు.
