TVK Vijay CM Post : మెజారిటీకి అడుగు దూరంలో విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు 3 మార్గాలు.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే సీఎం కుర్చీ దక్కేనా..?
TVK Vijay CM Post : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ వందకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుంది కానీ మెజారిటీ మాత్రం దక్కించుకోదు అంటున్నారు విశ్లేషకులు. మరి విజయ్ ముందున్న మార్గాలేంటి
- Dharani Pilli
- Updated on- May 4, 2026 / 02:37 PM IST
3 Ways Vijay TVK Party Could Form Government in Tamil Nadu State
TVK Vijay CM Post : తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ 100కు పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. విజయ్ అధికారం చేపట్టాలంటే 118 స్థానాల్లో విజయం సాధించాలి. ఈ నంబర్‌కు కూతవేటు దూరంలో టీవీకే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ కోసం తప్పకుండా ఇతర పార్టీలతో జట్టు కట్టాల్సి ఉంది. ఈ క్రమంలో తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉన్న 3 ప్రధాన మార్గాల గురించి రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.
చిన్న పార్టీలతో జట్టుకట్టడం
ఈ ఎన్నికల్లో టీవీకే మెజారిటీ రౌండ్ ఫిగర్ సాధించడం కోసం.. కొన్ని సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్, పీఎంకే (PMK) వంటి చిన్న పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఈ విధానంలో విజయ్ తన స్వంత ముద్రను నిలుపుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం ఉంటుంది.
ఏఐఏడీఎంకే (AIADMK)తో పొత్తు
విజయ్ ముందు మరో మార్గం కూడా ఉంది. అదే ఏఐఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవడం. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో ఏఐఏడీఎంకే 60కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే, ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఏఐఏడీఎంకే బలమైన ప్రతిపక్షంగా ఉన్నందున, కీలకమైన క్యాబినెట్ పదవుల విషయంలో, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో ఆ పార్టీ గట్టిగా బేరసారాలు ఆడేందుకు అవకాశం ఉంది.
డీఎంకే (DMK)తో పొత్తు
విజయ్ ముందున్న మరో మార్గం డీఎంకేతో పొత్తు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు. అనతి కాలంలోనే సూపర్ స్టార్ నుండి తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన విజయ్.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఓటర్ల నిర్ణయాన్ని అగౌరవించినట్లే అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత డీఎంకే ప్రభుత్వానికి స్పష్టమైన ప్రత్యామ్నాయంగా టీవీకేను నమ్మి ఓటు వేసిన ఓటరు.. తిరిగి అదే డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఆమోదించరు. పైగా ఇది ఆచరణ సాధ్యం కాదంటున్నారు.
