BARC సంచలన నిర్ణయం : న్యూస్ ఛానల్స్ TRP రేటింగ్స్ నిలిపివేత
- venkaiahnaidu
- Published On : October 15, 2020 / 03:11 PM IST
News Channel Ratings pause by BARC టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీ BARC(బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) సంచలన నిర్ణయం తీసుకుంది. పలు వార్తా ఛానళ్లు టీఆర్పీ స్కామ్ కు పాల్పడినట్లు కొద్ది రోజుల క్రితం ముంబై పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో న్యూస్ ఛానల్స్ యొక్క వీక్లీ రేటింగ్స్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బార్క్(Broadcast Audience Research Council)ప్రకటించింది.
12వారాల(3నెలలు) పాటు టెలివిజన్ వ్యూయర్షిప్ రేటింగ్స్ ఇవ్వడాన్ని నిలుపుదల చేస్తున్నట్లు బార్క్ గురువారం(అక్టోబర్-15,2020)బార్క్ ప్రకటించింది. ఈ మూడు నెలల కాలంలో అన్ని వార్తా ఛానెల్‌ల రేటింగ్‌లను బార్క్ ప్రచురించదని స్పష్టం చేసింది. అన్ని హిందీ, ప్రాంతీయ, ఇంగ్లీష్ న్యూస్ మరియు బిజినెస్ న్యూస్ ఛానెళ్లకు ఇది వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొంది. రేటింగ్ గణాంకాలను మెరుగుపరచడానికి ప్రస్తుత ప్రమాణాలను సమీక్షించి, వాటిలో మార్పులు చేర్పులు చేయాలని బార్క్ భావిస్తోంది.
బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) స్వాగతించింది. బార్క్ లో ముఖ్యమైన సంస్కరణలను అమలు చేయడానికి సస్పెన్షన్ కాలం ఉపయోగపడుతుందని ఎన్‌బిఎ ప్రెసిడెంట్ రజత్ శర్మ అన్నారు.
కాగా న్యూస్, మరియు ఎంటర్టైన్మెంట్ చానళ్లకు ఈ రేటింగ్ ఆధారంగానే యాడ్స్ వస్తుంటాయి. అయితే, కొంతకాలంగా ఛానల్ రేటింగ్ ను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ వివరణ ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ముంబైలో రేటింగ్ కుంభకోణం వెలుగులోకి రావడం చర్చనీయాంశం అయింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పలు చానళ్ళు పోలీసులను కోరుతున్నాయి.
