IAF Chief Ashutosh Dixit: భారత వైమానిక దళానికి కొత్త చీఫ్.. అశుతోష్‌ దీక్షిత్‌ను నియమించిన కేంద్రం.. రక్షణ శాఖ అధికారిక ప్రకటన

భారత వైమానిక దళ 29వ అధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌(IAF Chief Ashutosh Dixit) నియమితులయ్యారు.

Air Marshal Ashutosh Dixit as the next Chief of the Air Staff

IAF Chief Ashutosh Dixit: భారత వైమానిక దళ 29వ అధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వైమానిక దళ ఉప అధిపతిగా (వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌) సేవలందిస్తున్న ఆయన, ఈనెల 31న ప్రస్తుత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ పదవీవిరమణ చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరిస్తారు. భారత వైమానిక దళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ హోదా దక్కుతుంది.

Telangana Rains: తెలంగాణలో అకస్మాత్తుగా మారిన వాతావరణం.. రానున్న రెండు రోజులు వర్షాలు.. ఐఎంబీ కీలక హెచ్చరికలు!

3,500 గంటల ఫ్లయింగ్ అనుభవం.. కీలక ఆపరేషన్లలో భాగస్వామ్యం:

1966 డిసెంబరు 9న జన్మించిన అశుతోష్‌ దీక్షిత్‌(IAF Chief Ashutosh Dixit), 1986 డిసెంబరు 6న వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా చేరారు. దాదాపు నాలుగు పదుల సేవాకాలంలో ఆయన మిరాజ్‌-2000, వివిధ రకాల మిగ్‌ విమానాలు, జాగ్వార్, కిరణ్, ఐఎల్‌-78, హాక్, స్వదేశీ యుద్ధవిమానం తేజస్‌లను నడపడంలో నిపుణుడిగా పేరుగాంచారు. మొత్తం 3,500 గంటలకు పైగా యుద్ధవిమానాలు నడిపిన అపారమైన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాకుండా కార్గిల్ యుద్ధ సమయంలో చేపట్టిన ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్, ఆపరేషన్‌ రక్షక్, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక సైనిక ఆపరేషన్లలో ఆయన చురుగ్గా పాలు పంచుకున్నారు.

ప్రయోగాత్మక పరీక్షా పైలట్.. ‘మేక్ ఇన్ ఇండియా’ రక్షణ రంగానికి కొత్త ఊపు:

ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ కేవలం నిపుణుడైన పైలట్‌ మాత్రమే కాకుండా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్‌గా కూడా విశేష సేవలు అందించారు. తేజస్ వంటి స్వదేశీ విమానాల అభివృద్ధిలో, రక్షణ దళాల ఆధునీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన రాకతో భారత్ రక్షణ రంగంలో చేపడుతున్న ఆత్మనిర్భరత, స్వదేశీ పరిజ్ఞాన తయారీ ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యత లభించడమే కాకుండా, వైమానిక దళం మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకుంటుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.