Vote Turnout : తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్.. ఏకంగా 90 శాతం.. ఎవరికి కలసి రానుంది..?

Vote Turnout : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. రెండు రాష్ట్రాల్లో బంపర్ ఓటింగ్ నమోదైంది.

Assembly election 2026 bumper voting in tamil nadu 82 percent and west bengal 90 pc upto 5 pm

  • తమిళనాడులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
  • పశ్చిమ బెంగాల్లో 2, 3 చోట్ల ఉద్రిక్త పరిస్థితులు
  • భారీగా నమోదైన పోలింగ్

Vote Turnout : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ఉత్కంఠభరితంగా సాగింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ.. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముర్షిదాబాద్‌లో హుమాయూన్ కబీర్‌కు చెందిన ఏజేయూపీ (AJUP), తృణమూల్ సభ్యుల మధ్య ఘర్షణలు జరగగా, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో ఒక బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. సాయంత్రం 5 గంటల సమయానికి సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లలో 89.93 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు నివేదికలు వచ్చాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగియగా.. క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.

ఇదిలా ఉంటే తమిళనాడులో కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 82.24 శాతం పోలింగ్ నమోదైంది. అధికార డీఎంకే, ఏఐఏడీఎంకే-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) మధ్య ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల విశేషాలు:

ముర్షిదాబాద్‌లో హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP), అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య గొడవలు జరిగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ గొడవలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. హుమాయూన్ కబీర్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు.. టీఎంసీ మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

కుమార్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై.. టీఎంసీ పార్టీ సభ్యులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బూత్ ఆక్రమణ జరుగుతోందని తెలియడంతో సువేందు సర్కార్ అక్కడకు వెళ్లారు. అదే సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఆయనపై దాడి చేసినట్లు తెలిసింది. మరో చోట ఈవీఎంపై బీజేపీ గుర్తు అయిన ‘కమలం’పై సిరా పూయడంతో పోలింగ్‌కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. పూర్బా మేదినిపూర్‌లో బీజేపీ మద్దతుదారులు తృణమూల్ అభ్యర్థికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇదిలా ఉంటే రెండో దశలో పోలింగ్ జరగనున్న నదియా నియోజకవర్గంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. ఈ భారీ పోలింగ్ శాతం బెంగాల్‌లో బీజేపీ నిర్ణయాత్మక విజయాన్ని సూచిస్తోందని అన్నారు. “15 ఏళ్ల టీఎంసీ అరాచక పాలన (జంగిల్ రాజ్) అతి త్వరలో అంతం కాబోతుందని అభిప్రాయపడ్డారు. బెంగాల్ గడ్డపై ప్రజాస్వామ్య గౌరవాన్ని ఎన్నికల సంఘం మళ్లీ పునరుద్ధరించింది” అంటూ మోదీ అభినందించారు.

బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు సాగుతోంది. బీజేపీ అవినీతి, అక్రమ చొరబాట్లు మరియు పాలనా వైఫల్యాలను ఎండగడుతూ జాతీయవాద నినాదంతో ప్రచారం చేస్తోంది.