Bhojshala-Kamal Maula Controversy : హిందువులకు అనుకూలంగా తీర్పు.. అసలేంటి భోజ్ శాల – కమల్ మౌలా మసీదు వివాదం?

Bhojshala-Kamal Maula Controversy : మధ్యప్రదేశ్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల - కమల్ మౌలా మసీదు వివాదంపై సంచలన తీర్పు వెలువరించింది. ఆ ప్రాంగణం మొత్తం హిందువులకే చెందుతుందని తేల్చి చెప్పింది.

Bhojshala-Kamal Maula Controversy

Bhojshala-Kamal Maula Controversy : మధ్యప్రదేశ్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల – కమల్ మౌలా మసీదు వివాదంపై సంచలన తీర్పు వెలువరించింది. ఆ ప్రాంగణం మొత్తం హిందువులకే చెందుతుందని తేల్చి చెప్పింది. దీంతో కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే, దీనిపై ప్రతివాదులు పైకోర్టును ఆశ్రయించడానికి కూడా అవకాశం ఉంది.

అసలు ఏంటి ఈ భోజ్ శాల – కమల్ మౌలా మసీదు?
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ ప్రతిష్టాత్మక కట్టడం ఉంది. దీన్ని 11వ శతాబ్దంలో రాజా భోజ్ నిర్మించారనేది హిందూ వర్గం వాదన. ఆయన హయాంలో ధార్ నగరం సంస్కృ విద్యకు పేరుపొందిందని.. అక్కడ ఆలయం ఉందని వాదన. ఆ ఆలయంలో సరస్వతి దేవికి నిత్యపూజలు నిర్వహించే వారని.. ఆ తర్వాత జరిగిన ముస్లిం పాలకుల దాడుల్లో ఆలయాన్ని కూలగొట్టి అక్కడ మసీదు నిర్మించారని హిందువులు వాదించారు.

అక్కడ గుడి ఉందా? మసీదు ఉందా అనే విషయంపై చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. 2003వ సంవత్సరంలో హిందువులు, ముస్లింలు ఇరు వర్గాలు ప్రార్థనలు చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం రోజు హిందువులు పూజలు చేసుకోవచ్చు. శుక్రవారం రోజు ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చు. కానీ, అది ఆలయం కాబట్టి పూర్తి హక్కులు తమకే చెందాలని పిటిషన్లు వాదించగా హైకోర్టు గతంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అక్కడ ఉన్న పురాతన ఆధారాలను పరీశీలించి అక్కడ ఏం ఉండేదో చెప్పాలని ఆర్డర్ వేసింది.

కోర్టు ఆర్డర్ తర్వాత పురాతత్వ శాఖ తీవ్ర పరిశోధన చేసింది. అక్కడ ఆలయం ముందు ఉండేదని.. దాన్ని కూల్చి ఆ ఆనవాళ్ల మీదే మసీదు నిర్మించారంటూ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. ఆ ఆధారాలను పరిశీలించిన హైకోర్టు భోజ్ శాల పూర్తిగా హిందువులకు దక్కుతుందని తీర్పు చెప్పింది.

ముస్లిం వర్గం వాదన ఏంటి?
హైకోర్టు తీర్పు మీద ముస్లిం వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఏ ఆధారాలను బేస్ చేసుకుని ASI రిపోర్టు ఇచ్చిందని ప్రశ్నించారు. అక్కడ భోజ్ శాల ఉండేదనడానికి ఎలాంటి రికార్డులు లేవని వాదించారు. అసలు అలాంటి రికార్డులే లేకపోతే దాన్ని కూల్చి మసీదు కట్టారని వాదించడం ఏంటనేది ముస్లిం వర్గం వాదన. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా నిర్వహించాల్సిన కార్బన్ డేటింగ్ ఎందుకు చేయలేదని ముస్లింల తరఫు వాదనలు వినిపించిన ఖుర్షీద్ ప్రశ్నించారు. సర్వే సందర్భంగా మసీదుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ASI మార్చిందని ఆరోపించారు.

కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఎందుకు ఇచ్చింది?
మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు చాలా అంశాలను పరిశీలించింది. కేవలం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక మీదే ఆధారపడలేదు. అక్కడ చారిత్రక సాహిత్యం, కట్టడాల నిర్మాణ శైలితో పాటు మరికొన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఆ ప్రాంగణం పర్మార్ రాజవంశానికి చెందిన రాజా భోజ్ నిర్మించిందేనని తీర్పు చెప్పింది. రాజా భోజ్ హయాంలో అక్కడ సంస్కృతం ఫరిడవిల్లిందనడానికి సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

తర్వాత ఏం జరగనుంది?
లండన్ లో ఉన్న సరస్వతి దేవి విగ్రహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పునఃప్రతిష్టించాలని హిందువర్గం కోరుతోంది. అదే సమయంలో ఆ ప్రాగణం మొత్తం హిందువులకు చెందుతుంది కాబట్టి.. ముస్లింల కోసం వేరేచోట మసీదు కట్టుకోవడానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.