Bihar DSP Gautam Kumar : మామూలు ఆఫీసర్ కాదు.. భార్యతో పాటు గర్ల్ ఫ్రెండ్, పని మనిషికి కూడా రూ. కోట్ల ఆస్తులు.. లగ్జరీ లైఫ్
Bihar DSP Gautam Kumar : బిహార్ డీఎస్పీ ఒకరు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. కేవలం భార్య పేరు మీదే కాక లవర్, పని మనిషి పేర్లపై కూడా కోట్ల ఆస్తులు రాశాడు
- Dharani Pilli
- Published On : April 6, 2026 / 09:45 AM IST
Bihar DSP Gautam Kumar Allegedly amassed assets worth rs 80 crore
- కోట్లలో బిహార్ డీఎస్పీ అక్రమ సంపాదన
- పని మనిషికి రూ. కోటి ఇల్లు, రూ. 45 లక్షల థార్ కారు
- భార్య, గర్ల్ ఫ్రెండ్‌లవి విలాసవంతమైన జీవితాలు
Bihar DSP Gautam Kumar : చిన్నదో, పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు.. ఇక తరతరాల పాటు కూర్చుని తినేంతలా అక్రమ సంపాదన సంపాదించవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంటారు కొందరు అవినీతిపరులైన ఉద్యోగులు. తాజాగా బిహార్‌లో ఓ పోలీసు అధికారి అక్రమ సంపాదన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు.. గర్ల్ ఫ్రెండ్, ఆఖరికి పనిమనిషికి కూడా కోట్ల రూపాయల ఆస్తులు కట్టబెట్టాడు. ఆయన జీతం కన్నా అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మే 60 రెట్లు అధికంగా ఉందని వెల్లడైంది. ఆ వివరాలు..
బిహార్‌లోని కిషన్‌గంజ్ సబ్ డివిజన్ పోలీసు అధికారి (డీఎస్పీ)గా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ ఇంటిపై ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ (ఈఓయూ) తాజాగా దాడి చేసింది. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 31న ఈ దాడులు జరిగాయి, తాజాగా వాటి వివరాలను వెల్లడించారు. గౌతమ్ కుమార్ బిహార్, నోయిడా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అక్రమంగా ఆస్తులు గడించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆయన ఇప్పటి వరకు 36 ఆస్తులు, ఖరీదైన ఆభరణాలు, గడియారాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 80 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆయన కేవలం తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే కాక, తన ఇంట్లో పనిచేసే పనిమనిషి, గర్ల్ ఫ్రెండ్ పేరు మీద కూడా భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడు.
తాజాగా శనివారం నాడు అధికారులు గౌతమ్ కుమార్ అధికారిక నివాసంలో పనిచేసే పారో అనే మహిళ ఇంట్లో సోదాలు చేసినప్పుడు మరింత ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా కాగా.. ఆమెకు స్వరాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్‌లో రూ. కోటి విలువ చేసే బంగ్లా ఉంది. డీఎస్పీ ఇంట్లో పనిచేసే ఆమె రూ. 35 లక్షల విలువైన థార్ వాహనంలో తిరుగుతుంటుంది. వీటితో పాటు గౌతమ్ కుమార్ ఆమెకు బుల్లెట్ బండి కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వెల్లడైంది. అలాగే పారో ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 6 లక్షల విలువ చేసే నెక్లెస్ లభించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇదిలా ఉంటే గౌతమ్ కుమార్‌కు పశ్చిమ బెంగాల్‌లోని పూర్నియాలో విలాసవంతమైన 4 అంతస్తుల బిల్డింగ్, ఫామ్ హౌజ్, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కూడా ఫ్లాట్లు ఉన్నాయి. గౌతమ్ కుమార్ భార్య రూబీ కశ్యప్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమె కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. గౌతమ్ కుమార్ గర్ల్ ఫ్రెండ్ పగ్యపాటి కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనపై విచారణ కొనసాగుతోంది. తన 32 ఏళ్ల సర్వీసులో జీతం కన్నా కనీసం 60 శాతం అధికంగా సంపాదించినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
