Nana Patekar : సినీ పరిశ్రమలో విషాదం.. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత

Nana Patekar Passes Away : బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత నానా పటేకర్ (75) కన్నుమూశారు.

nana patekar passes away

Nana Patekar Passes Away : బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన్ను కాపాడేందుకు సుమారు 45 నిమిషాల పాటు వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. నానా పటేకర్ మృతి వార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Also Read : Aggipette Maccha Passed Away : అనారోగ్యంతో ‘అగ్గిపెట్టె మచ్చ’ కన్నుమూత.. చిగురువాడలో అంత్యక్రియలు

1951 జనవరి 1వ తేదీన మహారాష్ట్రంలోని మురుడ్‌లో నానా పటేకర్ జన్మించారు. ముంబైలోని సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో విద్యాభ్యాసం చేశారు. నటనపై ఆసక్తితో రంగస్థలంపై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో 1978లో గమన్ చిత్రం ద్వారా నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అరంగ్రేటం చేశారు. 1988లో వచ్చిన సలామ్ బాంబే ఆయన కెరీర్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. క్రాంతివీర్, నటసామ్రాట్ చిత్రాలతో సినీ అభిమానుల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.

తీవ్రమైన పాత్రలను మాత్రమే కాకుండా కామెడీ, కుటుంబ కథా చిత్రాల్లోనూ తన మార్క్ చూపించారు. ‘వెల్‌కమ్’ సినిమాలో ఉదయ్ భాయ్‌గా ఆయన చేసిన నటన ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ఈ పాత్ర నానా పటేకర్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది

హిందీ సినిమాలతోపాటు మరాఠీ, తమిళ సినిమాల్లోనూ ఆయన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అద్భుత నటనతో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. నానా పటేకర్‌ చివరిగా 2024లో వచ్చిన ‘వన్వాస్‌’లో కీలక పాత్ర పోషించారు.

నానా పటేకర్ తన విలక్షణ నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా తనదైన శైలిలో జీవించే నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. నానా పటేకర్ మృతివార్త సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నటించిన అనేక చిత్రాలు, పోషించిన విభిన్న పాత్రలను అభిమానులు సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నారు.