Bombay High Court: భర్త చనిపోయినా భరణం చెల్లించాల్సిందే.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
భర్త మరణించిన తర్వాత కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందే హక్కు మాజీ భార్యకు ఉంటుందని బాంబే హైకోర్టు(Bombay High Court) స్పష్టం చేసింది.
- V Santhosh Kumar
- Published on- June 18, 2026 / 11:15 AM IST
Bombay high court ruling on divorced wife maintenance after husband death
- భర్త మరణించినా భార్యకే భరణపు హక్కు.
- బకాయిలు చెల్లించాలని వారసులకు కోర్టు ఆదేశం.
- మరణానంతరం భరణం పెంచడం కుదరదని స్పష్టీకరణ.
Bombay High Court: భర్తతో విడిపోయిన మహిళలకు బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ద్వారా పెద్ద ఊరటనిచ్చింది. భర్త మరణించిన తర్వాత కూడా అతని ఆస్తి నుంచి భరణం (జీవనభృతి) పొందే హక్కు మాజీ భార్యకు ఉంటుందని జస్టిస్ భారతి, జస్టిస్ మంజూషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. భర్త చనిపోయాడనే కారణంతో భరణం చెల్లింపులను నిలిపివేయడానికి వీల్లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
2012లో నరైన్ గోరెగాంకర్ అనే వ్యక్తి మరణించడంతో, అతని మాజీ భార్య వర్షకు భరణం అందడం ఆగిపోయింది. దీనిపై ఆమె కోర్టు(Bombay High Court)ను ఆశ్రయించగా, పెండింగ్‌లో ఉన్న భరణం మొత్తాన్ని వర్షకు చెల్లించాలంటూ నరైన్ వారసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే, మారుతున్న జీవన వ్యయాలు, వైద్య ఖర్చుల దృష్ట్యా ఆ భరణం మొత్తాన్ని మరింత పెంచాలన్న ఆమె అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది.
భర్త జీవించి ఉన్న సమయంలో, అతని ఆస్తులు పెరిగినప్పుడు మాత్రమే భరణం పెంపును డిమాండ్ చేయడం సముచితమని హైకోర్టు పేర్కొంది. అతను మరణించిన తర్వాత, అతని వారసులు తమ స్వయంకృషితో వృద్ధి చేసుకున్న ఆస్తుల ఆధారంగా భరణం మొత్తాన్ని పెంచడం కుదరదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
