Capgemini Daycare: క్యాప్‌జెమిని సంస్థ డే కేర్‌లో ఘోరం.. చిన్నారిపై అమానుషం.. టాయిలెట్ లో పడేసి, వాషింగ్ మెషీన్ లో..
బెంగళూరు క్యాప్‌జెమిని(Capgemini Daycare) ప్రాంగణంలోని డే కేర్ సెంటర్‌లో ఓ చిన్నారిపై జరిగిన అమానుష వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
- V Santhosh Kumar
- Updated on- July 2, 2026 / 01:41 PM IST
Capgemini temporarily shuts Bengaluru daycare after videos show inhumane treatment of toddlers
- డే కేర్‌లో చిన్నారిపై అమానుషం
- ఐదుగురు మహిళా సిబ్బందిపై కేసు
- క్యాప్‌జెమిని డే కేర్ మూసివేత
Capgemini Daycare: బెంగళూరులోని హెచ్‌ఏఎల్ క్యాంపస్‌లో గల ప్రముఖ ఐటీ సంస్థ ‘క్యాప్‌జెమిని(Capgemini Daycare)’ ప్రాంగణంలోని డే కేర్ సెంటర్‌లో ఓ చిన్నారిపై జరిగిన అమానుష వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రెండు నుంచి మూడేళ్ల వయసున్న ఓ పిల్లాడిని డే కేర్ సిబ్బంది దారుణంగా హింసించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ వీడియోలో చిన్నారిని టాయిలెట్ నేలపై పడేసి ఏడిపించడమే కాకుండా, జెట్ స్ప్రేతో నోట్లోకి నీళ్లు కొట్టారు. మరో వీడియోలో పసివాడిని వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురిచేయడం చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 29న ఈ దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు ఐదుగురు మహిళా సంరక్షకులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
DWCRA Loans: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆ చార్జీలు ఉండవు
రంగంలోకి బాలల హక్కుల కమిషన్: తాత్కాలికంగా డే కేర్ మూసివేత
ఈ డే కేర్ సెంటర్‌లో ఉన్న పిల్లలందరూ ఆ క్యాంపస్‌లో పనిచేసే ఐటీ ఉద్యోగుల పిల్లలేనని బెంగళూరు తూర్పు విభాగం డీసీపీ సైదులు అడవత్ తెలిపారు. ఈ అమానుష ఘటనను కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించి, సమగ్ర నివేదిక కోరింది. దీనిపై స్పందించిన క్యాప్‌జెమిని యాజమాన్యం.. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొంటూ, ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరు క్యాంపస్‌లోని ఆ డే కేర్ సెంటర్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెంటర్‌ను సంస్థే నేరుగా నడుపుతోందా లేదా థర్డ్ పార్టీకి అప్పగించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఫ్రాన్స్ ప్రధాన కార్యాలయంగా ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది ఉద్యోగులతో నడుస్తున్న క్యాప్‌జెమిని లాంటి ప్రతిష్టాత్మక సంస్థలోనే ఇలాంటి ఘటన జరగడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లలు డే కేర్ సెంటర్లలో వేధింపులకు గురవుతున్నారని అనుమానం వస్తే, తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో గానీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కి గానీ ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే చిన్నారికి తక్షణమే వైద్య పరీక్షలు చేయించి న్యాయ సలహా తీసుకోవడం ఉత్తమం.
