3 Months Free Ration : రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పిన కేంద్రం.. 3 నెలల రేషన్ ఒకేసారి..!
3 Months Free Ration : కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Published On : March 21, 2026 / 07:19 AM IST
central government decide to distribute 3 months ration at a time in april 2026
3 Months Free Ration : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికి భారీ శుభవార్త చెప్పింది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ అనగా ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సంబంధించి ఉచితంగా ఇచ్చే రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. కేంద్ర నిల్వల నుంచి వెంటనే ధాన్యం తీసుకుని సమయానికి పంపిణీ చేయాలని ఆదేశించింది.
అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణాలున్నాయి. ఈ సంవత్సరం వేసవిలో ఎండ తీవ్రత బాగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జనాలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాసే అవసరం లేకుండా.. పదే పదే రేషన్ దుకాణాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో సామర్థ్యం కన్నా ఎక్కువగా ధాన్యం నిల్వ ఉంది. ఇక త్వరలోనే కొత్త రబీ పంట రాబోతుంది. ఈ క్రమంలో గోదాములను ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం FCI వద్ద 800 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం నిల్వ ఉందని సమాచారం. కొత్త రబీ పంట ధాన్యాన్ని నిల్వ చేయాలంటే.. ముందు ఉన్నదాన్ని ఖాళీ చేయాలని భావించిన ప్రభుత్వం.. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు సకాలంలో పంపిణీని నిర్ధారించడానికి వీలైనంత త్వరగా కేంద్ర నిల్వల నుండి ధాన్యాన్ని తీసుకోవాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నకిలీ రేషన్ కార్డులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నకిలీ కార్డులను గుర్తించి వాటిని తొలగిస్తోంది. డిజిటల్ సంస్కరణలు, ఆధార్ అనుసంధానం వల్ల మోసపూరిత లబ్ధిదారులను సులభంగా గుర్తిస్తున్న ప్రభుత్వం, నకిలీ కార్డుదారులను తొలగిస్తోంది.
