SARTHAK PDS Scheme: రేషన్ కార్డు దారులకు, డీలర్లకు శుభవార్త.. రూ.25 వేల కోట్లతో 2031 వరకు..!
SARTHAK PDS Ration: రేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- Dharani Pilli
- Updated on- May 28, 2026 / 12:45 PM IST
central govt approves rs 25530 cr to modernize ration system through SARTHAK PDS scheme
- కేంద్రం కీలక నిర్ణయం
- మరో ఐదేళ్ల పాటు సార్థక్ పీడీఎస్ పథకం
- రూ. 25,530 కోట్లు కేటాయించిన సర్కార్
SARTHAK PDS Scheme: రేషన్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. దాన్ని ఆధునీకరించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఐదేళ్ల పాటు అనగా 2031, మార్చి వరకు సార్థక్ పీడీఎస్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ‘సార్థక్-పీడీఎస్’ పథకం కొనసాగింపుకై నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం కేంద్రం రూ. 25,530 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అలానే రాష్ట్రాల పరిధిలో ఆహార ధాన్యాల రవాణా ఖర్చులను భరించడంతో పాటు రేషన్ డీలర్ల మార్జిన్లను క్రమబద్ధీకరించడం దీని ముఖ్య ఉద్దేశం.
ఈ సార్థక్ పీడీఎస్ పథకం కింద గతంలో ఉన్న రెండు ప్రధాన కార్యక్రమాలను ఒకే గొడుగు పరిధిలోకి తీసుకువచ్చారు. ఆ రెండు పథకాలు ఏవంటే.. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద రాష్ట్ర ఏజెన్సీలకు అందించే అంతర్గత రవాణా సాయం, ఫెయిర్ ప్రైస్ షాప్ (FPS) డీలర్ల మార్జిన్లతో పాటు స్మార్ట్ పీడీఎస్ (SMART PDS) పథకాలను ఈ సార్థక్ పీడీఎస్ స్కీమ్‌లో చేర్చారు.
*సర్కార్ సంచలన నిర్ణయం.. లక్షల రేషన్ కార్డులు రద్దు.. మీ కార్డు ఉందేమో చెక్ చేసుకొండి
ఈ పథకం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సార్థక్ పీడీఎస్ పథకం.. లబ్ధిదారుల గుర్తింపు నుంచి వారికి సరుకుల రవాణా, ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ వరకు మొత్తం పీడీఎస్ విలువ గొలుసును కవర్ చేస్తుంది. రవాణా ఖర్చులను భరించడంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ పథకం పరిష్కరిస్తుంది. అలానే, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల పారితోషికాన్ని పెంచడం ద్వారా వారి ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది.
*విద్యార్థులకు ఊరట.. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంచిన ప్రభుత్వం.. ఇదే లాస్ట్ ఛాన్స్..
పీడీఎస్ వ్యవస్థలో లీకేజీలను అరికట్టడంతో పాటు పారదర్శకతను పెంచడానికి ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP), మెషిన్ లెర్నింగ్ (ML), బ్లాక్‌చైన్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించనున్నారు. దీని ద్వారా రియల్ టైమ్‌గా పర్యవేక్షించడంతో పాటు AI ఆధారిత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా.. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద దేశంలోని సుమారు 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. గతంలో చేపట్టిన రేషన్ కార్డుల డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePoS) పరికరాల ద్వారా రేషన్ దుకాణాల ఆటోమేషన్ వంటి సంస్కరణలను ఈ కొత్త పథకం మరింత బలోపేతం చేయనుంది.
