Abhijeet Dipke : దీపావళి వరకు నిరసనలకు బ్రేక్.. కార్యకర్తలకు అభిజీత్ దీప్కే కీలక విజ్ఞప్తి.. కారణమిదే..!

Abhijeet Dipke : దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు.

Abhijeet Dipke

Abhijeet Dipke : దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. దీపావళి వరకు ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Also Read : Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్..? టీవీకే నేత కీలక కామెంట్స్..

పండుగల సమయంలో కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో సమయం గడపాలని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలతో కార్యకర్తల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో అభిజీత్ దీప్కే తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజుల పాటు నిరసనలకు దూరంగా ఉండి, కుటుంబాలతో కలిసి పండుగలను జరుపుకోవాలని కోరారు. గత కొన్నిరోజుల పరిణామాల నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

సీఈసీ (ప్రధాన ఎన్నికల కమిషనర్) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా జైలులో ఉండటాన్ని దీప్కే ప్రస్తావించారు.

తన తల్లిదండ్రులతో పాటు, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. జైలులో ఉన్నప్పటికీ ఇద్దరూ ధైర్యంగా ఉన్నారని, కష్టమైన పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయడం లేదని పేర్కొన్నారు.


ఇదిలాఉంటే.. జంతర్ మంతర్ వద్ద నిరసనల కోసం కేటాయించిన ప్రదేశాన్ని రద్దు చేసిన మరుసటి రోజే, తాళం వేసి ఉన్న గేటు ఎక్కి లోపలికి ప్రవేశించారనే ఆరోపణలపై సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అరెస్టు చేశారు. అక్టోబర్ 19న ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారి జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించారు. అంతకుముందు అక్టోబర్ 13న వారిని ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.

మరోవైపు.. దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా పండుగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజీత్ దిష్టిబొమ్మలతోపాటు ఈసారి కాక్రోచ్ (బొద్దిక) దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. దీనిపై అబిజిత్ దీప్కే స్పందిస్తూ.. తమ పార్టీకి ఉచితంగా పబ్లిసిటీ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.