Rs 5 Fish Rice : 5 రూపాయలకే చేపల కూరతో భోజనం.. గవర్నమెంట్ కొత్త మీల్స్ స్కీం
Rs 5 Fish Rice : సర్కార్ సరికొత్త మీల్స్ పథకం తీసుకు వచ్చింది. రూ.5కే చేపల కూరతో భోజనం పథకాన్ని ప్రారంభించనుంది.
- Dharani Pilli
- Updated on- May 26, 2026 / 05:56 PM IST
cm suvendu adhikari govt announces rs 5 fish rice meal in west bengal
- పశ్చిమ బెంగాల్ లో సరి కొత్త పథకం
- రూ.5కే చేపల కూరతో భోజనం
- రాష్ట్రవ్యాప్తంగా 400 క్యాంటీన్ల ఏర్పాటు
Rs 5 Fish Rice : సామాన్యుల కోసం సర్కార్ కొత్త మీల్స్ స్కీమ్ తీసుకువచ్చింది. రూ.5కే చేపల కూరతో భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఈ పథకం ప్రవేశపెట్టింది ఎక్కడంటే.. పశ్చిమ బెంగాల్‌లో. బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి మంగళవారం పలు సంక్షేమ పథకాలు ప్రకటించారు. వీటిల్లో ప్రధానమైంది రూ.5లకే చేపల కూరతో భోజనం. దీంతో పాటు మహిళలకు నెలవారీ ఆర్థిక సాయంతో పాటు.. విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాల సమీపంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధిస్తూ ప్రకటన చేశారు.
ఈ మేరకు నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న సువేందు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 400 ప్రత్యేక క్యాంటీన్లలో రూ.5 లకే చేపల కూరతో భోజనం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అలాగే మే 27 నుండి ‘అన్నపూర్ణ యోజన’ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను జారీ చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం అందనుంది.
*పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆస్తులెంతో తెలుసా? మమత బెనర్జీతో పోల్చితే.. ఆశ్చర్యపోవాల్సిందే..
వీటితో పాటు రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు, దేవాలయాలకు ఒక కిలోమీటర్ పరిధిలో మద్యం దుకాణాలను అనుమతించబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బెంగాల్‌లో “పాలకుడి పాలన కాదు, చట్టబద్ధమైన పాలన” సాగేలా ఒక కొత్త వ్యవస్థను తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు.
దీంతో పాటు సువేందు అధికారి మరో కీలక నిర్ణయం అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బెంగాల్‌లోని అక్రమ వలసదారులపై సువేందు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సువేందు చొరబాటుదారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. బెంగాల్ నుంచి వెళ్లగొట్టకముందే వారే పారిపోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో నివాసం ఉంటున్న బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భారత్ నుంచి వచ్చే తమ దేశ పౌరులను తిరిగి స్వీకరించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇప్పటికే దీనిపై ప్రకటన చేసిందన్నారు. అలాగే చొరబాటుదారులుగా గుర్తించిన వారికి జైళ్లలో చోటు లేదని సువేందు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వారికి జైళ్లలో ఆశ్రయమిచ్చి.. తిండి పెట్టడానికి వారేమైనా మన బంధువులా అని ప్రశ్నించారు. వీరి కోసం నిర్బంధ కేంద్రాలను (డిటెన్షన్ సెంటర్స్) ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
