Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. ధర్నాకు అనుమతి.. ఢిల్లీలో అడుగుపెట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే..
Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- Harish Thanniru
- Updated on- June 6, 2026 / 11:30 AM IST
Cockroach Janta Party' founder Abhijeet Dipke landed in Delhi
Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, ధర్నాను శాంతియుతంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీయకుండా శాంతియుత వాతావరణంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తమ నిరసన తెలుపుకోవచ్చునని పోలీసులు అనుమతి ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి లభించిందని సీజేపీ వెల్లడించింది.
Also Read : Sahara Desert Tragedy : ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి..
నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ వంటి పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ నిరసన తెలిపేందుకు శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించేందుకు ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నిర్ణయించారు. తొలుత నిరసనకు అనుమతి లభించకపోయినా.. తాజాగా. ఢిల్లీ పోలీసుల నుంచి సీజేపీ నిరసనకు అనుమతి లభించింది.
పోలీసుల అనుమతి అనంతరం సీజేపీ అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేసింది. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నిరసనకు అనుమతి ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా జంతర్ మంతర్ వద్దే తమ నిరసన చేపట్టొచ్చు. బొద్దింకలు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. అమెరికాలో ఉంటున్న సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో అభిజిత్ దీప్కేకు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. అయితే, విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి. అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఎయిర్ పోర్టులో నుంచి బయటకు వచ్చారు.
మరోవైపు.. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని మద్దతుదారులకు సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. తమతోపాటు జాతీయ జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఎలాంటి హింసకు తావులేకుండా కేవలం శాంతిపూర్వకంగానే నిరసన చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా సాధించుకుందామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
సీజేపీ నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని నిరసన ప్రదేశంలో, దాని సమీప ప్రాంతాల్లో సుమారు 2వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. మరోవైపు.. నిరసన ప్రదర్శనకు వేదికైన జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు దాదాపు 150మంది ఫొటోగ్రాఫర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వడం వంటి ఉద్రిక్తతలు, ఇతర గొడవలకు కారణమయ్యే వ్యక్తుల ఫొటోలను తీసేపనిని వీరికి అప్పగించినట్లు సమాచారం. మరోవైపు.. పెద్ద ఎత్తున యువత నిరసనలో పాల్గొనేందుకు కాక్రోచ్ మాస్కులు ధరించి వచ్చారు.
