Hostel PG Rent Hike : విద్యార్థులు, ఉద్యోగులకు షాక్.. భారీగా పెరగనున్న హాస్టల్, పీజీ అద్దెలు.. మే 5 నుంచే

Hostel PG Rent Hike : ప్రైవేటు హాస్టల్స్, పీజీలో ఉండే విద్యార్థులు, ఉద్యోగస్తులకు భారీ షాక్. మే 5 నుంచి అద్దెలు భారీగా పెరగనున్నాయి.

Commercial LPG Cylinder price hike impact tamil nadu Hostel Paying Guest rents to rise from May 5

  • విద్యార్థులు, ఉద్యోగులకు షాక్
  • మే 5 నుంచి భారీగా పెరగనున్న
  • హాస్టల్, పీజీ అద్దెలు

Hostel PG Rent Hike : కేంద్ర ప్రభుత్వం తాజాగా వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరను భారీ మొత్తంలో పెంచిన సంగతి తెలిసిందే. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారపదార్థాలు, టిఫిన్లు, స్నాక్స్ వంటి వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు ఇప్పుడు హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాల్లో కూడా ఫీజులు, అద్దెలను భారీగా పెంచేందుకు నిర్ణయించారు. సుమారు 10 శాతం అద్దెలు పెంచనున్నారు. ఈ నిర్ణయం విద్యార్థులు, ఉద్యోగులపై మరింత భారాన్ని మోపనుంది. అయితే, ఈ ఫీజుల పెంపు నిర్ణయం తీసుకుంది తమిళనాడులో.

తమిళనాడు అంతటా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాల నిర్వాహకులు అద్దెలను సుమారు 10 శాతం పెంచారు. ఐటీ (IT) హాస్టళ్లు, పీజీ యజమానుల రాష్ట్ర స్థాయి అసోసియేషన్ జారీ చేసిన అధికారిక సమాచారం ప్రకారం, పెంచిన అద్దె ధరలు మే 5, 2026, మంగళవారం నుండి అమలులోకి రానున్నాయి. ఈ పెరుగుదల విద్యార్థులు, ఉద్యోగస్తుల మీద తీవ్ర ప్రభావం చూపనుంది.

సవరించిన ధరల వివరాలు:

సవరించిన ధరల ప్రకారం.. నాన్-ఏసీ వసతి గృహాల కోసం నెలవారీ సుంకాలను కొత్త బేస్‌లైన్ పరిధిలోకి తీసుకొచ్చారు:

  • నలుగురు ఉండే గది (Four Sharing): నెలకు రూ. 6,500 నుండి రూ. 7,500 వరకు.
  • ముగ్గురు ఉండే గది (Three Sharing): నెలకు రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు.
  • ఇద్దరు ఉండే గది (Two Sharing): నెలకు రూ. 8,000 నుండి రూ. 9,000 మధ్య ఖర్చయ్యే అవకాశం ఉంది.

నిర్వాహకులు సూచించిన ప్రకారం.. లొకేషన్ (ప్రాంతం), సౌకర్యాలు, డిమాండ్‌తో సహా పలు కారణాల వల్ల హాస్టల్, పీజీ అద్దెలు పెరిగాయని తెలిపారు. అయితే, ప్రధాన కారణం మాత్రం 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర విపరీతంగా పెరగడమేనని పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం, గతంలో ఎన్నడూ లేని రీతిలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను అత్యధికంగా రూ. 993 వరకు పెంచింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో మన దేశంలో మూడవసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచారు.

ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి సంస్థలు ఉపయోగించే 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ. 2,078.50 ఉండగా, తాజా పెంపుతో అది రూ. 3,071.5కి చేరింది.