Crores Cash Found : వామ్మో.. మూడు డ్రమ్ములో రూ.500 నోట్ల కట్టలు.. పోలీసులకే దిమ్మతిరిగింది.. అసలు కథ ఇదే..
Crores Cash Found in Prayagraj : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో మూడు డ్రమ్ములో దాచిఉంచిన భారీగా బ్లాక్ మనీ వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది.
- Harish Thanniru
- Published on- October 30, 2026 / 08:25 AM IST
Crores Cash Found in Prayagraj
Crores Cash Found in Prayagraj : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో భారీగా బ్లాక్ మనీ వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఓ గ్రామంలోని ఇంట్లో 15 అడుగుల లోతున భూమిలో పాతిపెట్టిన మూడు డ్రమ్ములను పోలీసులు గుర్తించారు. వాటిని బయటకుతీసి చూడగా రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. ఈ డబ్బు విలువ సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదును అక్కడ ఎందుకు దాచారు? ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Hyderabad Honey Trap Case : హనీట్రాప్ కేసులో కీలక పరిణామం.. పవన్‌కు జ్యుడీషియల్ రిమాండ్!
ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బరైపూర్ రాంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేశ్ యాదవ్, రాజేశ్ యాదవ్‌లకు సంబంధించిన ఇంట్లోని భూమిలో భారీగా నగదు పాతిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏసీపీ ఫూల్‌పూర్, ఏసీపీ సొరావ్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
దాదాపు నాలుగు గంటలకుపైగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో భూమిలో దాచిన మూడు డ్రమ్స్‌ను గుర్తించారు. వాటిని బయటకు తీయగా రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. అవన్నీ నల్లటి ప్లాస్టిక్ కవర్లు, బట్టల్లో చుట్టి ఉన్నాయి. ఈ మొత్తం సుమారు రూ.10కోట్ల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నగదు వ్యవహారంలో రాకేశ్ యాదవ్, రాజేశ్ యాదవ్‌ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ గతంలో పుణెలో ఉద్యోగాలు చేసేవారని సమాచారం. రాకేశ్ యాదవ్ గతంలో పుణెలోని ఓ నగల దుకాణంలో సాధారణ ఉద్యోగిగా పనిచేసేవాడు. 2020 కరోనా సమయంలో ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కొద్దికాలంలోనే వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గ్రామస్థులు చెబుతున్నారు.
రాకేశ్ యాదవ్, రాజేశ్ యాదవ్‌లు కొద్ది సంవత్సరాల్లోనే భారీగా భూములు కొనుగోలు చేయడం, ట్రాక్టర్లు, ఇతర ఆస్తులు సమకూర్చుకోవడం, విలాసవంతమైన జీవితం గడపడం స్థానికుల్లో అనుమానాలు కలిగించాయి. రాకేశ్ 22ఎకరాల భూమి కొనడంతోపాటు, రూ.కోటి ఖర్చుతో ఇల్లు కట్టాడు. ఇటీవల కుటుంబంలో, ఇంటి పొరుగువారితో రాకేశ్‌కు జరిగిన వివాదాల నేపథ్యంలో భారీగా అక్రమ నగదు దాచినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి తనిఖీలు చేయగా.. భూమిలో పాతిపెట్టిన మూడు డ్రమ్ములు.. అందులో రూ.500 నోట్ల కట్టలు వెలుగుచూశాయి.
స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి పోలీస్ స్టోర్‌హౌస్‌కు తరలించారు. నగదును లెక్కించేందుకు సంబంధిత శాఖలకు సమాచారం అందించారు. ఆదాయపు పన్ను శాఖతో పాటు ఇతర ఆర్థిక దర్యాప్తు సంస్థలకూ సమాచారం ఇచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. డ్రమ్ములో ఎంత మొత్తం నగదు ఉందనేది అధికారిక లెక్కింపు పూర్తయిన తర్వాతే వెల్లడవుతుందని డీసీపీ (ట్రాన్స్ గంగా) సోనం కుమార్ తెలిపారు. ప్రస్తుతం నగదు ఎక్కడిది? దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఏవైనా నేరాలతో సంబంధం ఉందా అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
