Delhi Carrymen : మీరు షాపింగ్ చేయండి.. మేం బ్యాగులు మోస్తాం.. జస్ట్ రూ.150కే.. ఇక భర్తలకు రెస్ట్
Delhi Carrymen : ఢిల్లీలోని ఒక ప్రముఖ మార్కెట్ లో వెలువడిన స్టార్టప్ ఐడియా ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
- Dharani Pilli
- Updated on- May 24, 2026 / 05:22 PM IST
Delhi carryman shopping assistance per rs 149 per hour ad went viral
Delhi Carrymen : ఆలోచన ఉన్నవాడు.. ఆకలికి చావడు అనేది జీవిత సత్యం. అంతేకాదు, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉండాలే కానీ మన కళ్ల ముందే బోలెడన్ని ఉపాధి అవకాశాలు ఉంటాయి. కావాల్సిందల్లా కాస్త సృజనాత్మక ఆలోచన మాత్రమే. అది ఉంటే ఇదిగో ఇలాంటి విభిన్నమైన వ్యాపార ఆలోచనలు తెర మీదకు వస్తాయి. తాజాగా ఢిల్లీలోని ప్రముఖ మార్కెట్ లోని ఒక ప్రకటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ప్రకటన దేని గురించి అంటే.. షాపింగ్ అసిస్టెంట్స్. అదేంటంటే, ఇప్పటి వరకు కేర్ టేకర్లు, డెలివరీ పార్టనర్లు ఎలా ఉన్నారో.. అలానే ఇకపై మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఈ షాపింగ్ అసిస్టెంట్స్‌ను బుక్ చేసుకుంటే.. వారు మీ వెంటే ఉంటూ మీ షాపింగ్ బ్యాగులను మోస్తారు, మీతో పాటు పిల్లలు ఉంటే వారిని చూసుకుంటారు. ఇప్పుడీ ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది.
క్యారీమెన్ సర్వీస్..
ఢిల్లీలోని ప్రసిద్ధ లజ్‌పత్ నగర్ మార్కెట్ నుంచి వెలువడిన ఈ వినూత్నమైన షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్ (షాపింగ్‌లో సహాయం చేసే సేవ) ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గంటకు కేవలం రూ. 149 చెల్లిస్తే.. మీరు కొనుగోలు చేసిన షాపింగ్ బ్యాగులను మోయడానికి ఒక వ్యక్తిని రెంట్ (అద్దెకు) తీసుకోవచ్చని ఈ ప్రకటన సారాంశం. స్టార్టప్ శైలిలో ప్రారంభమైన ఈ సర్వీస్ పేరు ‘క్యారీమెన్’ (Carrymen). ఈ ప్రకటన ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవ్వడమే కాక.. సౌకర్యం, శ్రమ, ఆధునిక నగర జీవనశైలిపై తీవ్రమైన చర్చకు దారితీసింది.
గంటకు రూ. 149 మాత్రమే
ఈ వైరల్ పోస్ట్‌ను ‘ఎక్స్’ (ట్విట్టర్) వినియోగదారుడు ఖుష్ మహాజన్ షేర్ చేస్తూ.. “లజ్‌పత్ నగర్‌లో ఇప్పుడు మీరు గంటకు రూ. 149 చెల్లించి.. మీ బ్యాగులను మోయడానికి, ఫుడ్ క్యూలలో మీ కోసం వేచి ఉండటానికి, మిమ్మల్ని మెట్రో వరకు దింపడానికి, మెట్రోలో మీరు కూర్చోవడానికి స్థలం వెతకడానికి, అవసరమైతే మీ కోసం మడత కుర్చీ వేయడానికి కూడా ఒక వ్యక్తిని నియమించుకోవచ్చు. నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన బిజినెస్!!” అంటూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
భర్తలు చేసే పనే ఇది కదా..
దీనిపై నెటిజనులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరేమో ఈ ఐడియాను స్వాగతిస్తూ.. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రయాణాల్లో ఇలాంటి పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్లను నియమించుకునే ఆలోచన చాలా మంచిది అనగా.. మరికొందరు మాత్రం.. “ఈ పోస్ట్ గురించి మా నాన్నకు చెబితే.. కొత్తగా ‘క్యారీమెన్’ ఎందుకు.. ఆల్రెడీ ఇలాంటి పనులు చేయడానికి ఒక వ్యక్తి అందుబాటులోనే ఉన్నాడు.. దాన్నే ‘భర్త’ అంటారు అని నవ్వుకున్నారు” అని కామెంట్ పెట్టారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. “దయచేసి దీనిని షేర్ చేయకండి భయ్యా, మా అమ్మకు తెలిస్తే నన్ను తీసేసి ఆ క్యారీమెన్‌ను పెట్టుకుంటుంది!” అన్నారు.
ఈ ఐడియాపై చాలా మంది నవ్వుకుంటున్నప్పటికీ, మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఎండలు, రద్దీ, పొడవైన క్యూలు ఉండే పెద్ద పెద్ద నగరాల మార్కెట్లలో ఇలాంటి సేవలు చాలా అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఒక యూజర్.. “అద్భుతమైన బిజినెస్ ఐడియా. ఇది నిజంగా ఒక పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది” అని రాయగా, మరో యూజర్.. “అన్ని సేవలు అందరి కోసం కావు. ఎవరికి అవసరమో వారు వాడుకుంటారు” అని పేర్కొన్నారు.
అయితే, విమర్శకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశంలో శ్రమ (కూలీ) చౌకగా దొరకడం వల్లే ఇలాంటి బిజినెస్ మోడల్స్ నడుస్తున్నాయని, ఇది అంత అత్యవసరమైన సమస్యేమీ కాదని వాదిస్తున్నారు. “ఈ వ్యాపారాలలో ఎలాంటి ఆవిష్కరణ (innovation) లేదు. అవసరం లేని చోట ఖాళీలను భర్తీ చేయడానికి చూస్తున్నారు అంతే” అని ఒకరు కామెంట్ చేశారు.
