Puri Jagannath
Devotees allowed Jagannath Temple : ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా మూడు నెలలుగా మూసివున్న ఆలయాన్ని ఇవాళ తిరిగి తెరిచారు. నేటి నుంచి ఆగస్టు 16 వరకు ఆలయ సేవకుల కుటుంబ సభ్యులకు మాత్రమే జగన్నాథుని దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 23 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు.
కరోనా కారణంగా గత ఏప్రిల్ 24 నుంచి ఆలయాన్ని మూసేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇవాళ తిరిగి ఆలయాన్ని తెరిచారు. అయితే తొలి దశలో ఆలయ సేవకుల కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ కమిటీ జారీ చేసిన గుర్తింపు కార్డుతోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని తెలిపారు.
రెండో దశలో ఆగస్టు 16 నుంచి పూరీ నివాసితులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. మూడో దశలో ఆగస్టు 23 నుంచి భక్తులందరూ జగన్నాథుడి దర్శనం చేసుకోవచ్చన్నారు. అయితే ఆలయానికి వచ్చే ముందు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ, కొవిడ్-19 నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టు కానీ చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టు వ్యవధి దర్శనానికి ముందు 96 గంటలు మించకుండా ఉండాలన్నారు. వీటితోపాటు ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. అయితే పూరీ పట్టణంలో శని, ఆదివారాల్లో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుంది. కాబట్టి ఆ రెండు రోజులు జగన్నాథుడి ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు.