×
Ad

DK Shivakumar: కర్నాటక కాంగ్రెస్‌లో సంక్షోభం..? ఢిల్లీకి డీకే వర్గం ఎమ్మెల్యేలు..! ఏం జరుగుతోంది..

తాను రాజీనామా చేస్తాననే ఊహాగానాలు నిరాధారమైనవని అన్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని..

DK Shivakumar: కర్నాటక కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్యాంప్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. అధికార పంపిణీ సూత్రాన్ని అమలు చేయాలంటూ కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు డీకే శిబిరానికి చెందిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారని సమాచారం. ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో డీకేకు సీఎం పగ్గాలు అప్పగించాలని వారు కోరనున్నారట.

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తమ డిమాండ్‌ను తెలపనున్నట్లు సమాచారం. అంతేకాదు శుక్రవారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలుస్తారట. ఢిల్లీకి వెళ్లిన వారిలో దినేశ్‌ గూలిగౌడ, రవి గణిగ, గుబ్బి వాసు ఉన్నారు. ఇక అనేకల్‌ శివన్న, నేలమంగళ శ్రీనివాస్‌, ఇక్బాల్‌ హుస్సేన్‌, కునిగల్‌ రంగనాథ్‌, శివగంగ బసవరాజు, బాలకృష్ణ తదితరులు శుక్రవారం హస్తినకు వెళ్లనున్నారని సమాచారం.

సిద్ధరామయ్య మాట నిలబెట్టుకుంటారు..

సీఎం సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకుంటారని డీకే సోదరుడు సురేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార విభజనకు సంబంధించే సురేశ్ ఇలా మాట్లాడి ఉండొచ్చని డిస్కస్ చేసుకుంటున్నారు. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

మే 20, 2023న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి కాంగ్రెస్ పెద్దలు.. ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేలా శివకుమార్ ను ఒప్పించారు. అదే సమయంలో ఇద్దరు నాయకులు “రొటేషన్ ముఖ్యమంత్రి ఫార్ములా”తో కూడిన రాజీకి అంగీకరించారని తెలుస్తోంది. దీని ప్రకారం శివకుమార్ రెండున్నర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారు.

సీఎం మార్పు, అధికార విభజన ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తాను రాజీనామా చేస్తాననే ఊహాగానాలు నిరాధారమైనవని అన్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని పూర్తి కాలం పాలన కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదు హామీలను నెరవేర్చడానికి మేము నిజాయితీగా పని చేస్తామన్నారు. ఇక, నవంబర్‌ రెవల్యూషన్ అంటూ వస్తున్న ప్రచారం కేవలం మీడియా సృష్టేనని స్పష్టం చేశారు. తాను పదవిలో కంటిన్యూ అవుతానా లేదా అన్న చర్చ అనవసరమన్నారు. కాగా, రెండున్నరేళ్లు ముగిసిన నేపథ్యంలో క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణను పరిశీలించొచ్చని అధిష్ఠానానికి సూచించినట్లు తెలిపారు. రాహుల్‌ గాంధీతో చర్చించి చెబుతానని ఖర్గే హామీ ఇచ్చినట్లు చెప్పారు. దాన్నే కొందరు పవర్‌ షేరింగ్ గా బయట ప్రచారం చేస్తున్నారని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభంపై బీజేపీ నేత ఆర్ అశోక స్పందించారు. “ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కుర్చీని వదిలి వెళ్ళరు, డీకే శివకుమార్ మౌనంగా ఉండరు. రెండున్నర సంవత్సరాలు ఒప్పందం కుదిరింది. మొత్తం కర్ణాటక బాధపడుతోంది” అని అన్నారు.

DK Shivakumar: ఏ పదవి శాశ్వతం కాదు.. డీకే శివకుమార్ సంచలనం.. కర్నాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..