Jyotiraditya Scindia Onion : జేబులో ఉల్లిపాయ ఉంటే చాలు.. వడదెబ్బ పరార్.. కేంద్ర మంత్రి సూచన.. నిపుణులేమంటున్నారంటే

Jyotiraditya Scindia Onion : జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన ఉల్లిపాయ సలహా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Doctors explanation on jyotiraditya scindia Carrying Onions During A Heatwave Actually Help You Stay Cool

Jyotiraditya Scindia Onion : దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే జనాలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేసిన ఒక ప్రకటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ఆయన ఏమన్నారంటే.. తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉత్తర భారతదేశ వాసులకు జ్యోతిరాదిత్య సింధియా ఒక సలహా ఇచ్చారు. వేడి గాలుల నుంచి రక్షణ పొందాలంటే.. జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వేడి గాలుల నుంచి రక్షణ పొందుతామని ప్రకటించారు. ఇది మన సంప్రదాయ విశ్వాసాల నుంచి పుట్టిన ఒక విశ్వాసం. అయితే ఏకంగా మంత్రి దీని గురించి సూచన చేయడంతో ఇది నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారింది. అలానే నిజంగానే ఈ చిట్కా వడదెబ్బ నుంచి కాపాడుతుందా అనే చర్చ తెర మీదకు వచ్చింది.

మన దేశంలో ఇలాంటి ఇంటి చిట్కాలు కొత్తేమీ కాదు. పచ్చి ఉల్లిపాయ రసాన్ని తాగడం నుండి, ఉల్లిపాయ ముక్కలను శరీరంపై పెట్టుకోవడం వరకు.. ఉల్లిపాయలకు “చల్లబరిచే” గుణాలు ఉన్నాయని మన సంప్రదాయంలో ఒక నమ్మకం ఉంది. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మరింత తీవ్రమవుతున్న ఈ కాలంలో ఇలాంటి సంప్రదాయ నమ్మకాలను పాటిస్తే ఉపశమనం లభించకపోగా.. నష్టం వాటిల్లుతుంది అంటున్నారు.

ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న ఇలాంటి సమయంలో.. ఇటువంటి తప్పుడు సమాచారం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జేబులో ఉల్లిపాయను ఉంచుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది అనేది పూర్తిగా అవాస్తవం అన్నారు. ఈ అంశంపై భువనేశ్వర్‌లోని మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ నారాయణ్ సాహు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రీయ సమాచారం కంటే పుకార్లు వేగంగా వ్యాపిస్తాయి. జేబులో ఉల్లిపాయ ఉంచుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుందనే నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అని తెలిపారు.

ఈ నమ్మకం బహుశా ఉల్లిపాయల్లో ఉండే పోషక విలువల వల్ల వచ్చి ఉండవచ్చు. ఉల్లిపాయల్లో నీరు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, వీటిని ఆహారంగా తీసుకున్నప్పుడు హైడ్రేషన్‌కు (శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండటానికి) తోడ్పడతాయి. అయితే, బయట పెట్టుకోవడం వల్ల ఎటువంటి శారీరక ప్రయోజనం ఉండదు. “చర్మం ఒక కవచంలా పనిచేస్తుంది, ఉల్లిపాయ శరీరం నుండి వేడిని పీల్చుకునే మెకానిజం ఏదీ లేదు” అని డాక్టర్ సాహు పేర్కొన్నారు.

ఉల్లిపాయలను జేబులో పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరగకపోవచ్చున, కానీ అది ప్రాణాలను కాపాడే వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదంటున్నారు నిపుణులు. మూఢనమ్మకాలపై ఆధారపడటం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. కాబట్టి, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఉల్లిపాయల కంటే నీరు, నీడ మరియు సరైన దుస్తులపైనే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. ఎండలో మిమ్మల్ని కాపాడేది శాస్త్రీయ జాగ్రత్తలే తప్ప జేబులో ఉండే ఉల్లిపాయలు కాదు.