El Nino : వచ్చేది కష్టకాలమే..! 2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్.. వర్షాల భవిష్యత్తుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
El Nino Effect : హైదరాబాద్‌కు చెందిన భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) తాజా అంచనాల ప్రకారం, ఎల్‌నినో పరిస్థితులు 2027 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి.
- Harish Thanniru
- Published on- June 24, 2026 / 09:31 AM IST
el nino impact india monsoon february 2027
- తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు బిగ్ అలర్ట్
- 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం
- వర్షాల భవిష్యత్తుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
El Nino : మధ్య పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో ప్రభావం త్వరలో తగ్గే సూచనలు కనిపించడం లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత దేశంలో నైరుతి రుతుపవనాల ప్రారంభ దశలో వర్షపాతం తీవ్రంగా తగ్గడానికి కారణమైన ఈ ఎల్‌నినో.. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) తెలిపింది.
Also Read : CMR Paddy Fraud: పెద్దపల్లిలో భారీ స్కాం.. 158 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం.. పోలీసుల అదుపులో మిల్లర్లు
ఇటీవల విడుదల చేసిన తొలి నివేదికలో.. 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగేందుకు 70 నుంచి 90శాతం అవకాశం ఉందని ఇంకాయిస్ పేర్కొంది. అదేసమయంలో ఎల్‌నినో – సదరన్ ఆసిలేషన్ (ENSO) తటస్థ స్థితికి చేరుకునే అవకాశాలు కేవలం 10 నుంచి 30శాతం వరకు మాత్రమే ఉన్నాయని తెలిపింది. భారత దేశంలో రుతుపవనాలకు అనుకూలంగా భావించే లా నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ప్రస్తుతం 3శాతం కంటే తక్కువగా ఉన్నాయని, లా నినా ఏర్పడటం అత్యంత అసాధ్యమని ఇంకాయిస్ స్పష్టం చేసింది.
ఎల్‌నినో దీర్ఘకాలం కొనసాగడం వల్ల బంగాళాఖాతం, అరేబియా సముద్రాల పరిస్థితులు, మత్స్య సంపదపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా 2027లోనూ భారతదేశంలో నైరుతి రుతుపవనాలపై కూడా ప్రతికూల ప్రభావంచూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కొనసాగుతుండటంతో వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించి విస్తారంగా వర్షాలు పడాల్సి ఉంది. కానీ, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించలేదు.. వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో పడటం లేదు. దీంతో రైతుల వ్యవసాయంపై ప్రభావం పడుతుంది.
2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న నేపథ్యంలో వ్యవసాయంపైనే కాకుండా మత్స్య సంపదపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా సముద్ర జలాలు వేడెక్కడం వల్ల వాణిజ్యపరంగా కీలకమైన చేపల జాతుల విస్తరణ, సంచార మార్గాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఆయిల్ సార్డిన్, మాకెరెల్ చేపల వేట తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
