Ethanol E20 Fuel : ఇథనాల్ మిక్సింగ్‌పై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ.. కేంద్రం ఒక్క సమాధానంతో క్లారిటీ..!
Ethanol E20 Fuel : 20 శాతం ఇథనాల్ మిశ్రమం అనేది విధానపరమైన నిర్ణయం.. ఇందులో మార్పునకు ఎలాంటి ఛాన్స్ లేదు. డిమాండ్, ఇతర అంశాలను బట్టి కంపెనీలకు ఇథనాల్ పరిమాణం పెరగవచ్చు లేదా తగ్గవచ్చునని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి అన్నారు.
- Sreehari A
- Published on- June 30, 2026 / 03:40 PM IST
Ethanol E20 Fuel
Ethanol E20 Fuel : ఇథనాల్ మిక్సింగ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (E20) మిశ్రమం అమలుపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశంపై కోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది.
ఈ ఇథనాల్ మిక్సింగ్ అనేది ప్రస్తుతం ప్రయోగాత్మక కార్యక్రమమేనని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ ప్రయోగం కారణంగా పూర్తి ప్రభావం వచ్చే ఏడాదికి స్పష్టంగా తెలుస్తుందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వెల్లడించారు.
ఈ వ్యవహారం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైకోర్టు ఒక డిస్టిలరీకి ఇథనాల్ కేటాయింపును పెంచాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను పరిశీలించాలని ఆదేశించింది.
Read Also : New Aadhaar App : mAadhaar యాప్‌కు గుడ్‌బై.. మీ ఫోన్‌లో కొత్త ఆధార్ యాప్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
అయితే ఇప్పటికే 2025 అక్టోబర్‌లో ఇథనాల్ సరఫరా ఒప్పందాలు పూర్తయ్యాయని, ఇప్పుడు ఒక్క కంపెనీకి మార్పులు చేస్తే దేశవ్యాప్తంగా అమలవుతున్న ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై ప్రభావం పడుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.
అటార్నీ జనరల్ మాట్లాడుతూ.. :
ఏదైనా ఒక సంస్థకు మినహాయింపు ఇస్తే.. ఇతర సంస్థలు కూడా కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. తద్వారా మొత్తం సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టుకు ఆయన విన్నవించారు.
ఇథనాల్ విధానాన్ని మార్చే ఆలోచనలో లేదని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ అనేది ప్రభుత్వ విధాన నిర్ణయంగా పేర్కొంది. ఈ నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. అవసరాన్ని బట్టి ఇథనాల్ సరఫరా పరిమాణం మాత్రమే మారుతుందని స్పష్టం చేసింది.
E20 ఇంధనం కారణంగా పాత వాహనాలకు భారీగా నష్టం జరుగుతుందనే ఆందోళనలపై కూడా కేంద్రం స్పందించింది. దీనికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా విదేశీ చమురు దిగుమతులు తగ్గుతాయని, విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయని పేర్కొంది.
అంతేకాదు.. రైతులకు ప్రయోజనం, పర్యావరణ పరిరక్షణ, దేశ ఇంధన భద్రతకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. ప్రస్తుతం ఈ ప్రయోగం ఫలితాలపై అందరి దృష్టి పడగా వచ్చే ఏడాదిలో పూర్తి ఫలితాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
