Watermelon Prices : రాత్రికి రాత్రే రూ.7కు పడిపోయిన పుచ్చకాయ ధర.. ఆ నలుగురి మృతితో
4 Died Watermelon Price : మొన్నటి వరకు కిలో రూ.50 వరకు పలికిన పుచ్చకాయ ధర రాత్రికి రాత్రే రూ.7కి పడిపోయింది. కారణం ఏంటంటే..
- Dharani Pilli
- Updated on- April 29, 2026 / 04:02 PM IST
food poisoning incident impact watermelon prices down in mumbai
- ముంబై మార్కెట్ లో భారీగా పడిపోయిన పుచ్చకాయ ధర
- బిర్యానీ, పుచ్చకాయ తిని నలుగురి మృతితో
- కిలో రూ.7కి డౌన్
4 Died Watermelon Price : వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ పుచ్చకాయ తింటారు. సీజన్ కావడం, డిమాండ్ అధికంగా ఉండటంతో పుచ్చకాయ ధర కూడా భారీగానే ఉంటుంది. మొన్నటి వరకు పుచ్చకాయ కిలో ధర రూ. 30-50 మధ్యలో ఉండేది. కానీ అనూహ్యంగా రాత్రికి రాత్రే రూ. 7కు పడిపోయింది. అందుకు కారణం ఆ నలుగురి మృతి. అసలేం జరిగిందంటే..
ముంబైలో బిర్యానీ తిన్న తర్వాత అర్థరాత్రి పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా (40), అతడి భార్య, ఇద్దరు పిల్లలు శనివారం రాత్రి విందులో బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత తమ ఇంట్లో పుచ్చకాయ ముక్కలు తిన్నారు. దీని తర్వాత వీరందరూ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో అవస్థ పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఈ నలుగురు మరణించారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్ బృందం అబ్దుల్లా నివాసంలో పుచ్చకాయ, నీరు, చికెన్ పలావ్ నమూనాలను పరీక్షల కోసం సేకరించింది. పోస్టుమార్టం తర్వాత ఆ నలుగురు ఫుడ్ పాయిజనింగ్ వల్ల మరణించి ఉంటారని ప్రాథమిక నివేదిక నిర్ధారించింది.
ఈ క్రమంలో ముంబై జనాలు పుచ్చకాయ తినాలంటే భయంతో వణికిపోతున్నారు. దీంతో పుచ్చకాయ ధర భారీగా పడిపోయింది. నవీ ముంబై పండ్ల మార్కెట్‌లో ధర కిలోకు కేవలం రూ. 7కు పడిపోయింది. ఈ ఘటనకు ముందు వరకు ఈ మార్కెట్‌లో పుచ్చకాయ కిలో రూ. 10 నుంచి రూ. 35 మధ్య అమ్ముడయ్యేది. రిటైల్ మార్కెట్‌లో కిలో రూ. 30 నుంచి రూ. 100 మధ్య ఉండేది. కానీ పుచ్చకాయ తిన్న తర్వాత నలుగురు చనిపోయారనే వార్త రావడంతో.. డిమాండ్ అమాంతం పడిపోయి ధర రూ. 7కు పడిపోయింది. ఆ నలుగురి మృతి అటు కుటుంబంలో విషాదాన్ని, ఇటు వ్యాపారులకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే అబ్దుల్లా, అతడి కుటుంబ సభ్యుల మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
