Ajith : అభిమాని సెల్ ఫోన్ లాక్కున్న స్టార్ హీరో, బిత్తరపోయిన ఫ్యాన్.. అసలేం జరిగిందంటే..

తమిళ సూపర్ స్టార్ అజిత్ కు కోపం వచ్చింది. అభిమానులపై ఆయన సీరియస్ అయ్యాడు. అంతేకాదు ఓ అభిమాని చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కున్నాడు.

Hero Ajith Takes Phone From Fan : తమిళ సూపర్ స్టార్ అజిత్ కు కోపం వచ్చింది. అభిమానులపై ఆయన సీరియస్ అయ్యాడు. అంతేకాదు ఓ అభిమాని చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కున్నాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అజిత్‌ తన భార్య షాలినీతో కలిసి తిరువన్ మియూర్ లోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసి బయటకు వచ్చిన అజిత్ తో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. దీంతో అజిత్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతేకాదు పిచ్చ కోపం కూడా వచ్చింది. తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ని అజిత్ కోపంగా లాక్కుని జేబులో పెట్టుకున్నారు. దీంతో అతగాడు బిత్తరపోయాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు అజిత్.

అసలే ఇది కరోనా టైమ్. మహమ్మారి రెచ్చిపోతోంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మాస్కు మస్ట్. భౌతిక దూరం కచ్చితం. అలాంటిది.. అభిమానులు అజిత్ ని చుట్టుముట్టారు. అంతేకాదు.. ఓ అభిమాని మాస్కు కూడా వేసుకోలేదు. పైగా అజిత్ దగ్గరగా వచ్చి సెల్ఫీ దిగేందుకు ట్రై చేశాడు. దీంతో అజిత్ కు అతడిపై తీవ్ర కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, అతడి చేతి నుంచి ఫోన్ లాక్కునేంత. కాసేపటి తర్వాత సదరు అభిమానికి అతని ఫోన్ తిరిగి ఇవ్వడంతో పాటు సారీ కూడా చెప్పి తన గొప్ప మనసు చాటుకున్నారు హీరో అజిత్. ఏది ఏమైనా అభిమానులు సంయమనం పాటించాలి. కరోనా విపత్కర పరిస్థితుల్లో అభిమానం పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కరోనాతో గేమ్స్ ఆడితే ప్రాణాలకే ప్రమాదం. మీ ప్రాణాలను రిస్క్ లో వేయడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే.

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇవాళ(ఏప్రిల్ 6,2021) ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సామాన్యులతో సెలబ్రిటీలు పోటెత్తారు. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విజయ్ వంటి సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు