TVK Vijay TN Governor : విజయ్ కి మద్దతుగా హీరోలు, పార్టీలు.. గవర్నర్ నిర్ణయం అప్రజాస్వామికం.. ప్రజల తీర్పు పట్ల గౌరవం ఇదేనా..?
TVK Vijay TN Governor : విజయ్ ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తమిళనాడు గవర్నర్ తీరుపై సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
- Dharani Pilli
- Updated on- May 7, 2026 / 03:26 PM IST
hero vishal actor prakash raj inc party slams tn governor decision supports tvk vijay on govt formation
TVK Vijay TN Governor : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అపూర్వ విజయాన్ని సాధించింది. మొత్తం 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మేజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో ఆగిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సంపూర్ణ మెజారిటీ లేదన్న కారణంతో తమిళనాడు గవర్నర్ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ అనుసరిస్తున్న ఈ తీరుపై సినీ హీరోలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్‌కు ప్రజల మద్దతు స్పష్టంగా ఉందని, గవర్నర్ కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రజా తీర్పుపై గవర్నర్‌కు ఉన్న గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు హీరో విశాల్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ గవర్నర్ వైఖరిని తప్పుబడుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నర్ తీరు సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నటుడు ప్రకాష్ రాజ్ గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘తమిళనాడు గవర్నర్ ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదు. ఆయన తీరు రాజ్యాంగ విరుద్ధమైనది. మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు… కానీ విజయ్‌కు ప్రజల మద్దతు లభించింది. కనుక సభలో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఆయనకు ఇవ్వాలి’’ అని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
*తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. కమల్ హాసన్ సంచలన కామెంట్స్..
హీరో విశాల్ సైతం గవర్నర్ నిర్ణయంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘2017/18లో గోవా, మణిపూర్, మేఘాలయ మరియు మరీ ముఖ్యంగా కర్ణాటకలో జరిగినటువంటి పరిస్థితే ఇక్కడ కూడా కనిపిస్తోంది. అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ‘ఫ్లోర్ టెస్ట్’ ద్వారా మెజారిటీ నిరూపించుకోమని అడిగారు. అదే పద్ధతిలో తలపతి విజయ్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడానికి తమిళనాడు గవర్నర్ ఎందుకు వెనుకాడుతున్నారు? ప్రజల తీర్పు పట్ల గౌరవం అంటే ఇదేనా?’’ అని నిలదీశారు.
233 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని, టీవీకే దాదాపు మెజారిటీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఇంత పెద్ద తీర్పు ఇచ్చిన తర్వాత తమకు గవర్నర్ పాలన కాదు, ఒక ప్రభుత్వం కావాలని విశాల్ స్పష్టం చేశారు. ఈ ప్రాథమిక హక్కులు కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన తమిళనాడు ప్రజలకు కూడా తెలుసన్నారు. ‘‘ప్రియమైన విజయ్.. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, చేస్తారు. ఒక ఓటరుగా నేను దీనినే కోరుకుంటున్నాను’’ అని విశాల్ తన మద్దతును ప్రకటించారు.
అలానే కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడు గవర్నర్ నిర్ణయాన్ని తప్పు పట్టింది. తమిళ ప్రజల తీర్పు స్పష్టంగా.. గట్టిగా ఉందని.. దాన్ని గౌరవించి తీరాలని స్పష్టం చేసింది.
