ఈ రాష్ట్రాలు ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేవు..

Goa Liberation Day : 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశంలోని అత్యధిక ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యాయి. అప్పటికి గోవాలో పోర్చుగీసు పాలన కొనసాగుతోంది.

Goa Liberation Day

1947 ఆగస్ట్ 15. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, మీకు తెలుసా? భారత భూభాగంలోని కొన్ని రాష్ట్రాలు అసలు బ్రిటిష్ పాలనలోనే లేవు. అలాంటి కొన్ని స్టేట్స్ సంగతి చూద్దాం. అందులో మొదటిది గోవా.  గోవా ఎప్పటికి బ్రిటిష్ పాలనలో లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయంలో గోవా పోర్చుగీసు పాలనలో కొనసాగింది. చివరకు 1961లో భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా గోవా విముక్తి పొందింది. ఈ సైనిక చర్య 36 గంటలకు పైగా కొనసాగి, 19 డిసెంబర్ 1961న పోర్చుగీసు దళాల లొంగుబాటుతో ముగిసింది.

Also Read : China Maglev Vehicle : చైనా మరో అద్భుతం.. 800 కి.మీ. వేగాన్ని కేవలం 5.3 సెకన్లలోనే.. ఆరు నెలల్లో మూడో రికార్డు!

1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశంలోని అత్యధిక ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యాయి. అప్పటికి గోవాలో పోర్చుగీసు పాలన కొనసాగుతోంది. పోర్చుగీసులు 1510 నుంచి గోవాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత గోవాను భారత్‌లో విలీనం చేయడానికి దౌత్యపరంగా ప్రయత్నాలు జరిగాయి. కానీ, పోర్చుగల్ గోవాపై తన నియంత్రణను వదులుకోవడానికి అంగీకరించలేదు. దీంతో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా సుదీర్ఘకాలం గోవా వారి పాలనలోనే కొనసాగింది.

1961 డిసెంబర్‌లో పరిస్థితి కీలక మలుపు తిరిగింది. భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో భూ, వాయు, సముద్ర మార్గాల్లో సైనిక చర్య ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ డిసెంబర్ 17 నుంచి 19 వరకు సాగింది. 36 గంటలకుపైగా జరిగిన సైనిక చర్య అనంతరం పోర్చుగీసు గవర్నర్ మాన్యుయెల్ ఆంటోనియో వస్సాలో ఇ సిల్వా లొంగిపోయారు. దీంతో 1961 డిసెంబర్ 19న గోవా అధికారికంగా భారతదేశంలో భాగమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజుతో భారత భూభాగంలో కొనసాగుతున్న పోర్చుగీసు పాలనకు ముగింపు పలికింది.

పోర్చుగీసు నుంచి భారత దేశంలో భాగమైన తరువాత గోవాతోపాటు దమన్, దీవ్ ప్రాంతాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 1967లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో గోవా మహారాష్ట్రలో విలీనం కావాలా లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగాలా అనే అంశంపై ప్రజలు ఓటు వేశారు. మెజారిటీ ప్రజలు కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగాలని నిర్ణయించారు. అయితే, 1987 మే 30న గోవాకు రాష్ట్ర హోదా లభించింది. దీంతో గోవా భారతదేశంలోని 25వ రాష్ట్రంగా అవతరించింది.

కేవలం గోవా మాత్రమే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు. అయితే, పుదుచ్చేరి ఫ్రెంచ్ పాలనలో ఉంది. అలాగే, తెలంగాణ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, రాష్ట్రాలు స్థానిక రాజుల పాలనలో కొనసాగాయి. అవి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే బ్రిటిషర్లతో ఒప్పందాలు చేసుకుని వాటి సహాయ సహకారాలతో ముందుకు సాగాయి.