రాహుల్ గాంధీ ‘లయ్యర్ ఆఫ్ ద ఇయర్‌’

పౌరసత్వ నమోదుతో పేదవారిపై పన్ను విధిస్తున్నారంటూ రాహుల్ గాంధీ కామెంట్లు చేసిన కాసేపటిలోనే విమర్శలు ఎదుర్కొన్నారు. బీజేపీ లీడర్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాహుల్ వ్యాఖ్యలను ఎండగట్టారు. అభిమానులను కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా మద్ధతు కోసం మాత్రమే పౌరసత్వ చట్ట సవరణ, ఎన్పీఆర్ లపై మాట్లాడుతుందని ఆరోపించారు. 

‘ఎన్పీఆర్(పౌరసత్వ నమోదు) అనేది ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్‌తో కూడినది కాదని, ఈ వివరాల ఆధారంగా పేదలను గుర్తించగలమని అన్నారు. తద్వారా సంక్షేమ పథకాలను వారికి అందించగలమని’ జవదేకర్ తెలిపారు. 

‘రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఎప్పుడూ అబద్ధాలు చెబుతూనే ఉండేవారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కాకపోయినా అబద్ధాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. లయర్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీ ఏమైనా ఉంటే అతను దానికి అర్హుడు. అతను చేసే కామెంట్లు అతని కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని చింతించేలా చేస్తున్నాయి’ అని జవదేకర్ వెల్లడించారు. 

అంతకంటే ముందు రాహుల్ గాంధీ ఎన్పీఆర్ (జాతీయ పౌరసత్వ నమోదు) అనే స్కీంతో పేద ప్రజలపై పన్నురుద్దాలని బీజేపీ ప్రభుత్వం అనుకుంటుందని రాహుల్ అన్నారు. ‘అది ఎన్నార్సీ, ఎన్పీఆర్ ఏదైనా సరే పేదలపై పన్ను విధించడం కోసమే. నోట్ల రద్దు అనేది పేద ప్రజలపై పన్ను విధించింది. బ్యాంకుకు వెళ్లి మీ డబ్బు కూడా మీరు తీసుకోలేని దుస్థితి’ అని అభిప్రాయపడ్డారు. 

పేద ప్రజలు ఆఫీసులకు వెళ్లి అందులో తప్పులు ఉంటే అధికారులకు లంచం ఇచ్చి మార్పులు చేసుకుంటున్నారని అన్నారు. ఇలా పేద ప్రజలపై పేర్లలో మార్పులు ఉండడంతో అధికారుల జేబులు నిండుతున్నాయన్నారు. ఇది నేరుగా ప్రజలపై ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ సమయాన్ని ఇలా ఎందుకు వృథా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.