నేను శివభక్తుడిని, ఇలాంటి విషాన్ని మింగేస్తాను: ప్రధాని మోదీ
మోదీతో పాటు ఆయన తల్లి హీరాబెన్‌పై ఏఐ వీడియో రూపొందించిన కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ ఐటీ సెల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Narendra Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలే తనకు అధికారం ఇచ్చారని, వారే తన యజమానులని అన్నారు. ప్రజల చేతిలోనే తన రిమోట్ కంట్రోల్ ఉందని, వారిముందే తన ఆవేదనను వ్యక్తం చేస్తానని చెప్పారు. తాను శివభక్తుడినని, దూషణల విషాన్ని మింగేస్తానని అన్నారు.
మోదీతో పాటు ఆయన తల్లి హీరాబెన్‌పై ఏఐ వీడియో రూపొందించిన కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ ఐటీ సెల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బిహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో కొందరు మోదీ తల్లిని దూషిస్తూ కామెంట్స్ చేశారని బీజేపీ అంటోంది. ఈ నేపథ్యంలోనే దూషణల విషాన్ని మింగేస్తానని ఇవాళ మోదీ వ్యాఖ్యానించారు. (Narendra Modi)
అసోంలోని దరంగ్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత మోదీ బహిరంగ సభలో మాట్లాడారు. “కాంగ్రెస్ వ్యవస్థ మొత్తం నన్నే లక్ష్యంగా తీసుకుని, మోదీ మళ్లీ ఏడుస్తున్నాడని చెబుతుందని నాకు తెలుసు.
ప్రజలే నా దేవుళ్లు, నా ఆవేదనను వారిముందు వ్యక్తం చేయకపోతే ఇంకెక్కడ చేస్తాను? వారే నా యజమానులు, నా దైవాలు, నా రిమోట్ కంట్రోల్ వారి చేతుల్లోనే. నా విషయంలో వేరే రిమోట్ కంట్రోల్ లేదు” అని అన్నారు.
“దశాబ్దాల పాటు కాంగ్రెస్ అసోంను పాలించింది. కానీ 60-65 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై మూడు వంతెనలే నిర్మించింది. మీరు మాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఒక్క దశాబ్దంలోనే ఆరు కొత్త వంతెనలు కట్టాం. అందుకే మా కృషిని గుర్తించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు” అని ప్రధాని అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పాలనలో భారత్‌లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఆ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండేదని అన్నారు. “ఇప్పుడు మా బలగాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై దాడులు చేశాయి.
కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం పాకిస్థాన్ సైన్యానికి మద్దతుగా ఉంటున్నారు. పాక్ అజెండాలను ముందుకు తీసుకెళ్తారు. పాకిస్థాన్ చెప్పే అబద్ధాలు కాంగ్రెస్ అజెండా అవుతాయి. అందుకే మీరు ఎప్పుడూ కాంగ్రెస్‌పై ఓ కన్నేసి ఉండాలి” అని ప్రధాని అన్నారు.