Screen Addiction Bouncers : స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారిన యువతి.. కఠిన నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు.. బౌన్సర్లను పెట్టి మరీ
Screen Addiction Bouncers : మొబైల్ ఫోన్ కి బానిసగా మారిన యువతిని ఆ అలవాటు నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆమె తల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.
- Dharani Pilli
- Updated on- May 3, 2026 / 10:09 PM IST
In Gujarat Father Hires 4 Bouncers To Control Daughters Screen Addiction
Screen Addiction Bouncers : 16 ఏళ్ల కుమార్తె కోసం ఆమె తండ్రి నలుగురు బౌన్సర్లను నియమించాడు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏం ఉంది.. బిడ్డ రక్షణ కోసమే అలాంటి పని చేశాడేమో అనుకుంటున్నారా. అవును రక్షణ కోసమే అయితే అది మనుషుల నుంచి రక్షణ కోసం కాదు. మొబైల్ ఫోన్ నుంచి ఆమెని కాపడటం కోసం సదరు యువతి తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అంటే తన కుమార్తె మొబైల్ చూడకుండా కట్టడి చేయడం కోసం బౌన్సర్లను నియమించాడు. వారి విధి ఆమె మొబైల్ వాడకుండా చూడటమే. ఈ బౌన్సర్లు రెండు షిఫ్టుల్లో పనిచేస్తూ, ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ వాడకుండా 24 గంటల పాటు నిఘా ఉంచుతున్నారు. తమ కుమార్తెను స్మార్ట్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడేయడానికి ఆ కుటుంబం నెలకు దాదాపు రూ. 65,000 ఖర్చు చేస్తోంది.
వైద్యుల సమాచారం ప్రకారం, ఆ అమ్మాయి సోషల్ మీడియా స్మార్ట్‌ఫోన్‌కు తీవ్రంగా బానిసలైపోయింది. అదే ప్రపంచం అన్నట్లుగా గడిపేది. ఈక్రమంలో రోజురోజుకూ పెరుగుతున్న ఆమె ఫోన్ పిచ్చిని చూసి తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ అలవాటును మాన్పించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ లాభం లేకపోయింది. నఫోటోలు షేర్ చేసే యాప్‌లలో నిరంతరం ఫోటోలు పోస్ట్ చేయడమే కాక అపరిచితులతో చాటింగ్ చేయడం ఆమెకు ఒక వ్యసనంగా మారింది.
వీటిన్నింటికి తోడు.. సదరు యువతి.. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను కలవడానికి తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రారంభించింది. దీంతో యువతి తల్లిదండ్రులు ఆమె వద్ద నుంచి మొబైల్ లాక్కుంటే.. సదరు యువతి తీవ్ర ఆగ్రహానికి గురయ్యేది. కోపంతో ఊగిపోతూ ఇంట్లోని వస్తువులను విసిరివేయడం, పగలగొట్టడం చేసేది. ఇలా యువతి వద్ద నుంచి ఫోన్‌ను లాక్కున్న ప్రతిసారీ ఆమె హింసాత్మకంగా ప్రవర్తించేది.
దీంతో యువతి మానసిక పరిస్థితి గురించి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెని వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వారి సూచన మేరకు యువతిని మొబైల్ వినియోగించకుండ చూడటం కోసం చివరి ప్రయత్నంగా తల్లిదండ్రులు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నెలకు రూ.65 వేల ఖర్చుతో ఇద్దరు బౌన్సర్లను నియమించి.. కుమార్తెను కంట్రోల్ చేస్తున్నారు.
