Husband Murders Report 2026 : భర్తలూ.. జాగ్రత్త..! దేశంలో ప్రతిరోజు ఇద్దరు భర్తలు హత్య.. ఒకరు ఆత్మహత్య.. తాజా నివేదికలో దిగ్భ్రాంతికర గణాంకాలు
Husband Murders Report 2026 : ఏకం న్యాయ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి జూన్ వరకు భర్తల మరణాలకు సంబంధించి మొత్తం 554 కేసులు నమోదయ్యాయి. వీటిలో 322 మంది భర్తలు హత్యకు గురయ్యారు.
- Harish Thanniru
- Published on- July 19, 2026 / 08:15 AM IST
Ekam Nyay Foundation 2026 Report on Husbands Murders
- దేశంలో ఆరు నెలల్లో 554 మంది భర్తలు మృతి
- 322 హత్యలు.. 232 మంది ఆత్మహత్యలు
- ఏకం న్యాయ్ ఫౌండేషన్ సంచలన నివేదిక
Husband Murders Report 2026 : దేశంలో భర్తలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి గురుగ్రామ్‌కు చెందిన ఎన్జీఓ ఏకం న్యాయ్ ఫౌండేషన్ విడుదల చేసిన తాజా నివేదిక చర్చనీయాంశమైంది. 2026 తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు హత్యకు గురయ్యారని, ఆత్మహత్య చేసుకున్నారని సంస్థ వెల్లడించింది. వీరిలో 322 మంది హత్యకు గురవగా, 232 మంది వివాహ బంధంలో నెలకొన్న సమస్యల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేర్కొంది. ఈ గణాంకాలు మీడియా కథనాల ఆధారంగా సేకరించినవేనని.. అధికారిక ప్రభుత్వ డేటా కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, పురుషులపై జరిగే గృహ హింస, హత్యలు సరైన స్థాయిలో నమోదు కావడం లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : Muzaffarnagar Incident: రెండేళ్లుగా లైంగిక దాడి.. మామ మర్మాంగాన్ని కోసేసిన కోడలు.. యూపీలో షాకింగ్ ఘటన
ఏకం న్యాయ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి జూన్ వరకు భర్తల మరణాలకు సంబంధించి మొత్తం 554 కేసులు నమోదయ్యాయి. వీటిలో 322 మంది భర్తలు హత్యకు గురయ్యారు. ఈ 322 హత్యల్లో 194 కేసులు (60.2 శాతం) అక్రమ సంబంధాల కారణంగానే జరిగాయని నివేదిక పేర్కొంది. భర్తలు భార్యల అక్రమ సంబంధాలకు అడ్డుగా మారడంతో, ప్రియుడితో కలిసి కుట్ర పన్ని హత్య చేసిన ఘటనలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మిగిలిన కేసుల్లో కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, కుటుంబ సభ్యుల కుట్రలు వంటి కారణాలు ఉన్నాయని వెల్లడించింది.
ఇక ఆత్మహత్య చేసుకున్న 232 మంది భర్తల్లో 104 మంది (44.83 శాతం) దీర్ఘకాలిక కుటుంబ కలహాల వల్ల ప్రాణాలు తీసుకున్నారని నివేదిక తెలిపింది. 57 కేసుల్లో (24.57 శాతం) భార్య లేదా ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు, 29 కేసుల్లో (12.5 శాతం) అక్రమ సంబంధాల కారణంగా ఆత్మహత్యలు జరిగినట్లు పేర్కొంది. తప్పుడు కేసులు, మానసిక వేధింపులు, పిల్లలను కలవనివ్వకపోవడం వంటి అంశాలు కూడా కారణాలుగా ఉన్నాయని నివేదిక తెలిపింది.
ఈ ఏడాది అత్యంత దారుణమైన 25 కేసులను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. తల నరికి హత్య చేయడం, శరీరాలను ముక్కలు చేయడం, విషం ఇవ్వడం, సజీవ దహనం చేయడం, మృతదేహాలను పాతిపెట్టడం, ప్రమాదం లేదా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు వంటి ఘటనలను ఇందులో వివరించింది. అనేక ఆత్మహత్య కేసుల్లో బాధితులు సూసైడ్ నోట్లు, వీడియోలు వదిలి వెళ్లినట్లు పేర్కొంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 93 హత్యలు, 103 ఆత్మహత్యలు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్నట్లు పేర్కొంది.
ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రతి కేసు ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని అన్నారు. భర్తల హత్యలు, పురుషులపై గృహ హింసకు సంబంధించి అధికారిక నేర గణాంకాల్లో ప్రత్యేక విభాగం లేకపోవడం వల్ల సమస్య తీవ్రత అంచనా వేయడం కష్టమవుతోందని పేర్కొన్నారు.
