కెనడా హైకమిషనర్ కు భారత్ సమన్లు
- Subhan Ali Shaik
- Updated on- December 4, 2020 / 04:06 PM IST
India summons Canadian High Commissioner ఢిల్లీలో జరుగుతోన్న రైతుల నిరసనలపై సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో,ఇతర ఎంపీలు,మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్ శుక్రవారం(డిసెంబర్-4,2020) ఆ దేశ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసింది. అలాంటి చర్యలు కొనసాగితే.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భారత్ హెచ్చరించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం ఆమోద యోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది.
కెనడా హైకమిషనర్ కు ఇవాళ సమన్లు జారీ చేశాం. భారతీయ రైతులకు సంబంధించిన సమస్యలపై కెనడా ప్రధాని, కొందరు కేబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదని తెలియజేశాం.అలాంటి చర్యలు కొనసాగితే..ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించాం. కెనడా నాయకులు చేసిన వ్యాఖ్యలు.. అక్కడి భారత హైకమిషన్, కాన్సులేట్ ముందు ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీసే ప్రమాదం ఉంది. దాంతో భద్రత సమస్యలు తలెత్తుతాయి. భారతీయ హైకమిషన్ అధికారులకు కెనడా ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుందని భావిస్తున్నాం. ఉగ్రకార్యకలాపాలను రెచ్చగొట్టే చర్యలకు వారి రాజకీయ నేతలు దూరంగా ఉండాలి అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
కాగా, సోమవారం(నవంబర్-30)గురునానక్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ…భారత్లో జరుగుతోన్న రైతుల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. శాంతియుత నిరసనలకు కెనడా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. అలాగే.. భారత్ లో తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై స్పందించిన మొదటి విదేశీ నాయకుడు ట్రూడోనే. భారత రైతుల ఆందోళనలపై కెనడా రక్షణ మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత్ వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
