Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరింత సులభంగా రైలు టికెట్.. ఆగస్టు నుంచి అమల్లోకి..
Indian Railways : రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు దశాబ్దాల తరువాత రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను సమూలంగా అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది.
- Harish Thanniru
- Published on- June 9, 2026 / 08:47 AM IST
Indian Railways
- రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
- రైల్వే రిజర్వేషన్లకు కొత్త వ్యవస్థ
- ఆగస్టు నుంచి దశలవారీగా అమలు
Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు దశాబ్దాల తరువాత రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను సమూలంగా అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. దీంతో రైల్వే టికెట్ల బుకింగ్ విధానం వేగవంతం కానుంది. ఆగస్టు నుంచి నూతన రిజర్వేషన్ వ్యవస్థ అమల్లోకి రానుంది. దశల వారిగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని రైల్వే శాఖ పేర్కొంది.
Also Read : PM Ujjwala Yojana : గ్యాస్ వినియోగదారులకు మరో బిగ్‌షాక్.. ఇకపై తొమ్మిది కాదు.. కేవలం నాలుగు మాత్రమే..
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 1986లో ప్రారంభమైన పాత వ్యవస్థ స్థానంలో కొత్త అధునాతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్పిడి ప్రక్రియను సున్నితంగా నిర్వహించాలని సూచించారు. ఈ విధానం ఆగస్టు నుంచి దశలవారీగా జరుగుతుందన్నారు. అయితే, పూర్తి అమలుకోసం కచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించలేదు.
ఈ విధానం ద్వారా టిక్కెట్ బుకింగ్ సామర్థ్యం భారీగా పెరుగుతుంది. నిమిషానికి 1 లక్ష 25 వేల టిక్కెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వెయిటింగ్ లిస్ట్ నిర్ధారణ అంచనాలు ఇస్తుంది. ఇది 95 శాతం కచ్చితత్వంతో పని చేస్తుంది. బుకింగ్ వేగం పెరుగుతుంది. సర్వర్ సమస్యలు తగ్గుతాయి. ప్రయాణీకుల సేవలు మెరుగుపడతాయి. ప్రస్తుతం 88శాతం టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థను 1986లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి స్వల్ప మార్పులు మినహా సమూలంగా అప్‌గ్రేడ్ చేయలేదు. 2002లో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను తీసుకొచ్చారు. దీంతో రిజర్వేషన్ కౌంటర్ల వద్దకు రావడం కంటే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకే ఎక్కువమంది ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ సమయంలో ఇబ్బందులు పడకుండా రిజర్వేషన్ వ్యవస్థను సమూలంగా అప్‌గ్రేడ్ చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.
ఇదిలాఉంటే.. గతేడాది జూలైలో రైల్‌వన్ యాప్‌ను 3.5 కోట్ల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకోగా.. ప్రతిరోజూ 9.29లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వేశాఖ తెలిపింది. అయితే, ఈ తాజా అప్‌గ్రేడ్ రైల్వే టికెట్ బుకింగ్ చరిత్రలో ఒక మైలురాయి. ప్రయాణీకుల అనుభవం మెరుగుపడుతుంది. తత్కాల్ బుకింగ్ వంటి సేవలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్ట్ సుమారు రూ.1,000 కోట్ల రూపాయల వ్యయంతో అమలవుతోంది. ప్రయాణీకుల సంఖ్య, డిమాండ్ పెరిగినందున పాత వ్యవస్థ సరిపోవడం లేదని, కొత్త వ్యవస్థ భద్రతను కూడా మెరుగుపరుస్తుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
