Gas Booking : గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. కానీ, ఇలా చేయాలి..! సరికొత్త స్కీమ్..
Gas Booking : గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇండియన్ ఆయిల్ ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ (Indane XTRALITE NOW) అనే కొత్త సర్వీసును ప్రారంభించింది.
IndianOil express delivery service
Gas Booking : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లో, సిలిండర్ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. అంతేకాక.. గతంలో ఉదయం గ్యాస్ బుక్ చేస్తే సాయంత్రం లేదంటే మరుసటిరోజు ఉదయం ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేది. కానీ, ప్రస్తుతం గ్యాస్ బుక్ చేసిన సమయం నుంచి రెండుమూడు రోజులైనా సిలిండర్ ఇంటికి డెలివరీ కావడం లేదు. దీంతో గ్యాస్ వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులకు స్వస్తి చెబుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఓ ఆసక్తికర స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇండియన్ ఆయిల్ ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ (Indane XTRALITE NOW) అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. దీనిద్వారా కస్టమర్లు బుక్ చేసిన మూడు లేదా నాలుగు గంటల్లోనే 10కిలోల కాంపోజిట్ సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుంది. అయితే, కొత్త కనెక్షన్ కోసం ఎక్కువ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. ‘IndianOil One’ యాప్ ద్వారా లేదంటే ఇండియన్ ఆయిల్ కస్టమర్ పోర్టల్ లేదా 7588888824 వాట్సాప్ నంబర్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు.
గృహిణులు చాలామంది గ్యాస్ అయిపోయిన వెంటనే కొత్త గ్యాస్ సిలిండర్కోసం బుక్ చేస్తారు.. ఇటీవల కాలంలో రెండుమూడు రోజులైనా గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ అనే కొత్త సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్లో అదనపు సిలిండర్ లేకపోయినా మూడు నాలుగు గంటల్లో కొత్త కాంపోజిట్ సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. ఇది బరువు తక్కువగా ఉండటంతో మోయడం కూడా తేలిక. వేగంగా కస్టమర్లకు డెలివరీ అందించేందుకు అవకాశం ఉంటుంది.
అయితే, ఇండేన్ ఎక్స్ ట్రాలైట్ నౌ తత్కాల్ సేవ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4గంటల తరువాత గ్యాస్ బుకింగ్ చేస్తే.. మరుసటి రోజు ఉదయం ఇంటికి డెలివరీ అవుతుంది. అయితే, ఈ సేవను పొందడానికి కస్టమర్లు సాధారణ సిలిండర్ ధరతో పాటు అదనంగా కొంత తత్కాల్ సేవా రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఈ సేవలు పుణే, గురుగ్రామ్, ఇండోర్, కోయంబత్తూరులో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని నగరాలకు ఇది విస్తరించనుంది.
10కిలోల కాంపోజిట్ సిలిండర్లను తుప్పుపట్టని యాక్రిలిక్ ఫైబర్ గ్లాస్ మెటీరియల్ తో తయారు చేస్తారు. అందుకే ఇవి సాధారణ ఇనుప సిలిండర్ల కంటే 50శాతం తక్కువ బరువు ఉంటాయి. దీని పారదర్శక డిజైన్ వల్ల సిలిండర్ లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయటి నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పూర్తిగా పేలుడు నిరోధక సామర్థ్యం కలిగి ఉండటంతో వంట గదిలో మరింత భద్రతను అందిస్తుంది. ప్రస్తుతం ఈ సేవ దేశంలోని ప్రధాన మెట్రో నగరాలు, ఎంపిక చేసిన కొన్ని పంపిణీ కేంద్రాలలో మాత్రమే ప్రారంభమైంది.
