Mamata Banerjee: మమత అస్త్రసన్యాసం.. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం?

Mamata Banerjee TMC: ఇండీ కూటమి సమావేశానికి ఢిల్లీకి వచ్చిన మమతా బెనర్జీతో కాంగ్రెస్ కు చెందిన ఓ ముఖ్య నాయకురాలు ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై మమతా బెనర్జీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు.

  • Published on- June 11, 2026 / 12:30 PM IST

Mamata Banerjee Planning TMC Congress Merger

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందనే చర్చలు జోరందుకున్నాయి. ఇండీ కూటమి సమావేశానికి ఢిల్లీకి వచ్చిన మమతా బెనర్జీతో కాంగ్రెస్ కు చెందిన ఓ ముఖ్య నాయకురాలు ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై మమతా బెనర్జీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. కానీ, రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు ముందుకు పడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి 80 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. బీజేపీ 208 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు టీఎంసీ ఖేల్ ఖతం చేసే దిశగా సాగుతున్నాయి. టీఎంసీ హయాంలో దాదాగిరీ చేసి డబ్బులు వసూలు చేసి పనులు చేయని నేతలను జనం కొడుతున్నారు. సాక్షాత్తూ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మీద కోడిగుడ్లతో దాడి చేశారు. మరికొందరు నేతలను కొట్టారు. ఓ నేతకు దేహశుద్ధి చేసి చెప్పుల దండ వేసి ఊరేగించారు.

రాజకీయ సంక్షోభం

నేతల మీద దాడులు పక్కన పెడితే అసలు పార్టీనే మునిగిపోయే పరిస్థితి తలెత్తింది. రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. సుఖేందు శేఖర్ రాయ్, సుస్మిత దేవ్ నిన్నటి వరకు రాజీనామా చేయగా, ఈ రోజు (జూన్ 11)న మరో రాజ్యసభ ఎంపీ చిక్ బారిక్ రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో టీఎంసీ బలం10కి పడిపోయింది. వచ్చే వారం మరికొందరు ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

*భారత్‌లో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. దేశం 2014కు ముందు.. ఇప్పుడెలా ఉందో గమనించాలి.

టీఎంసీలో రెబల్ హవా..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో రెబల్స్ పెరిగిపోయారు. మమతా మేనల్లుడు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షాత్తూ స్వయంగా ఓడిపోయిన మమతా బెనర్జీ పార్లమెంట్ కు వెళ్లేందుకు ఎంపీ ఇర్ఫాన్ పఠాన్ ను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్టు ప్రచారం జరిగింది. కానీ, అందుకు ఇర్ఫాన్ పఠాన్ వ్యతిరేకించినట్టు సమాచారం. ఇప్పుడు ఆయన కూడా మమతా వ్యతిరేకవర్గంలో చేరారు.

పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం?

టీఎంసీ రాజ్యసభ సభ్యుల వరుస రాజీనామాలు, లోక్ సభ ఎంపీల వ్యతిరేకగళం చూస్తుంటే టీఎంసీ పార్లమెంటరీ పార్టీ మొత్తం బీజేపీలో విలీనం చేసే దిశగా అడుగులు ముందుకు పడుతున్నట్టు తెలుస్తోంది.