అబ్బా..మద్యం లారీ బోల్తా..పోలీసుల దెబ్బల్నికూడా లెక్కచేయకుండా బాటిల్స్ తో పరుగే పరుగు

  • Publish Date - August 7, 2020 / 12:09 PM IST

ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసే రకం జనాలు. అటువంటిది మద్యం లారీ బోల్తా పడితే ఎగబడకుండా ఉంటారా? అంటే ఆహా..అస్సలు క్షణం కూడా ఆగరు. మూలనున్నా ముసలాడు కూడా లగెత్తుకుంటూ వెళ్లిపోతాడు.అదే జరిగింది గురువారం (ఆగస్టు 6,2020)చత్తీస్‌గఢ్‌లో.



మద్యం బాటిళ్ల లోడుతో వెళుతోన్న ఓ ట్రక్కు బోల్తా పడింది. అది తెలిసిన జనాలు ఎగబడ్డారు. ఇదే సరైన సమయం అనుకొని దొరికినకాడికి బాటిళ్లను ఎత్తుకెళ్లిపోతున్నారు. మద్యం ట్రక్ బోల్తాపడిన విషయం పోలీసులు తెలిసింది. అంతకంటే ఫాస్టు గా వచ్చేశారు పోలీసులు కూడా. మద్యం బాటిల్స్ పట్టుకుని పరిగెడుతున్నవారిపై లాఠీలతో ప్రతాపం చూపెట్టారు. దొరికినవాడిని దొరికినట్లుగా లాఠీలతు కమ్మేశారు. కానీ ఇవేవీ పట్టించులేదు జనాలు. లాఠీ దెబ్బలు కూడా పూలచెండుల్లా అనిపించాయి మద్యం బాటిల్స్ ముందు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



కవర్ధాలో ఓ మద్యం లోడు లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకడంతో స్థానికులు పరుగు పరుగున వచ్చేసి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఖరీదైన వాటిని ఎంచుకొని మరీ పట్టుకెళ్లారు. ఆ ట్రక్కు‌లో 200 కార్టన్ల మద్యం బాటిళ్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. లారీలు బోల్తా పడినప్పుడు అందులో ఉన్న సరుకునే ఎత్తుకెళ్లడం సహజంగా మారిపోయింది. కాగా నష్టంపై అంచనా వేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.